నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు..

5 Jan, 2018 04:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిపోయిన స్టార్ యాంకర్‌ ప్రదీప్‌ వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. ప్రస్తుతం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పోలీసులు పట్టుబడుతున్నా ప్రదీప్‌ రాకపోవడంతో అతడు పరారీలో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయంపై యాంకర్ ప్రదీప్ ఓ వీడియో ద్వారా స్పందించారు. తాను తప్పుచేసినట్లు అంగీకరించిన ప్రదీప్.. ఇంకెవరూ తనలాగా తప్పుచేయకూడదంటూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాను ఇప్పటికీ పోలీస్ కౌన్సెలింగ్‌కు ఎందుకు హాజరుకాలేదు, ఇతరత్రా విషయాలను వీడియో ద్వారా ప్రదీప్ షేర్ చేసుకున్నారు.

ఆ వీడియోలో ప్రదీప్ ఏమన్నారంటే.. 'అందరికీ నమస్కారం.. నేను మీ ప్రదీప్ మాచిరాజు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఏం జరిగిందో అందరికీ తెలుసు. దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్స్‌ను చట్ట ప్రకారమే ఫాలో అవుతాను. నాకు వచ్చిన సూచనల ప్రకారం పోలీస్ కౌన్సెలింగ్ కానీ, దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్‌కు హాజరు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే ఈలోగా నేను ముందుగానే కమిట్ అయిన ప్రోగ్రామ్స్, ఇతర ఈవెంట్ల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. అందువల్ల నేను అందుబాటులో లేనంటూ కొందరు ఆందోళన చెందుతున్నారు. తెలియజేసేది ఏమంటే షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్లనే కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయాను.

కంటిన్యూగా ఫోన్ మోగడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అయుండొచ్చు. దయచేసి మీడియా మిత్రులకుగానీ, ప్రేక్షకులకు గానీ తెలియజేయడం ఏమనగా.. చట్ట ప్రకారం అన్ని ప్రొసీడింగ్స్ ఫాలో అవుతాను. గతేడాది డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఓ వీడియో గురించి చెప్పాను. అవును.. దురదృష్టవశాత్తూ నేను అందులో లభించాను. నేను తెలియజేసేది ఏమంటే.. నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదని కోరుకుంటున్నాను. అందరూ నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నానంటూ' ప్రదీప్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే గత డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయిన మందుబాబులు దాదాపు కౌన్సెలింగ్‌కు హాజరుకాగా, యాంకర్ ప్రదీప్ మాత్రం రాలేదు. ప్రదీప్‌ పోలీస్ కౌన్సెలింగ్‌కు గత మూడురోజులుగా హాజరుకాకపోవడంతో అతని కోసం ఇళ్లు, కార్యాలయంలో పోలీసులు ఆరా తీసినా అందుబాటులోకి రాలేదని సమాచారం. ప్రదీప్ పరారయ్యాడని, జైలు శిక్ష పడుతోందని కౌన్సెలింగ్‌కు హాజరుకావడం లేదని ప్రచారం అవుతుండగా తన గురించి ఆందోళన చెందవద్దని.. త్వరలోనే లా ప్రొసీడింగ్స్ ఫాలో అవుతానంటూ ఓ వీడియోను ప్రదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బ్రీత్ అనలైజర్‌తో ప్రదీప్‌ను పరీక్షించినప్పుడు 178 పాయింట్లు రావడంతో పాటు.. ఈ స్టార్ యాంకర్ నడుపుతున్న వాహనం అద్దాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా బ్లాక్‌ఫిల్మ్‌ ఉండటంతో ఆర్టీఏ చట్ట ప్రకారం కూడా అతనిపై చర్యలు తీసుకొనే అవకాశముందని తెలుస్తోంది.

నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా