ప్రేమోన్మాదం

20 Nov, 2018 13:10 IST|Sakshi
ప్రేమోన్మాది బాలాజీ

సాక్షి, చెన్నై : ప్రేమోన్మాదం మరోమారు కోరలు చాచింది. పెళ్లికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఓ కిరాతక ప్రియుడు ప్రియురాలి గొంతుకోసి హతమార్చాడు. తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు.
రాష్ట్రంలో ఇటీవల ఒన్‌సైడ్‌ ప్రేమకు బలి అవుతున్న యువతుల సంఖ్య పెరుగుతోంది. అలాగే,  ప్రేమించి చెట్టాపట్టలు వేసుకుని తిరిగి, చివరకు పెళ్లికి నిరాకరిస్తున్న ప్రియురాళ్లు ఉన్మాద ప్రియుల చేతిలో బలవుతున్నారు. ఇక, ప్రేమ పేరుతో వేధించడం, తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ప్రేమోన్మాదులుగా మారే యువత సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.  ఇటీవల ప్రేమ పేరుతో బలైన వారు కొందరయితే, కులాంతర ప్రేమ వివాహాలు చేసుకుని పరువు హత్యలకు గురైన వారు మరెందరో. ఈ పరిస్థితుల్లో ప్రేమికులుగా చెట్టా పట్టలు వేసుకుని తిరిగి, చివరకు పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పడంతో ఉన్మాదిగా మారిన ప్రియుడు తన ప్రియురాలి గొంతుకోసి హతమార్చడం తిరువొత్తియూరులో కలకలం రేపింది.

ఉన్మాదిగా..
చెన్నై తిరువొత్తియూరు గాంధీనగర్‌కు చెందిన వేణుగోపాల్‌ పెయింటర్‌. ఈయన కుమార్తె భారతి బీఎడ్‌ పూర్తిచేసింది. ప్రస్తుతం ఇంటికి సమీపంలోని ఓ మోటార్‌ సైకిల్‌ షోరూమ్‌లో సేల్స్‌ గర్ల్‌గా పనిచేస్తున్నారు. కాంచీపురం జిల్లా వెల్ల కోట్టైకి చెందిన సెల్వన్‌ కుమారుడు బాలాజీ తరచూ తిరువొత్తియూరుకు వచ్చే సమయంలో భారతిని చూసి మనసు పారేసుకున్నాడు. ఆమె పనిచేస్తున్న షోరూమ్‌కు తరచూ వెళ్లి వస్తూ పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. చెట్టా పట్టలు వేసుకుని తిరుగుతున్న ఈ ప్రేమ జంట వ్యవహారం పెద్దల దృష్టికి చేరింది. తొలుత పెద్దలు నిరాకరించారు. తదుపరి అంగీకరించారు. అయితే, బాలాజీ ఓ రోజు మద్యం సేవిస్తూ భారతి కంటపడడం వారి ప్రేమకు బ్రేక్‌ పడేలా చేసింది. దీంతో ఆ యువతి బాలాజీని దూరం పెట్టే పనిలో ఆమె నిమగ్నం అయింది. ఇది బాలాజీని ఆగ్రహానికి గురిచేసింది. తరచూ మద్యం సేవించి భారతితో గొడవ పడడం మొదలెట్టాడు. ఈ వ్యవహారం ఇంటివరకు చేరడంతో భారతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అదే సమయంలో తమ కుమార్తెను చేసుకోదలచితే వ్యసనాల్ని మానుకుని, తమ మతం స్వీకరించాలని మెలిక పెట్టినట్టు సమాచారం.

దీంతో కోపోద్రిక్తుడైన బాలాజీ ఉన్మాదిగా మారాడు. తనకు దక్కని భారతి మరొకరికి దక్కకూడదని హతమార్చేందుకు సిద్ధం అయ్యాడు. ఆదివారం రాత్రి మద్యానికి చిత్తై వచ్చిన బాలాజీ తిరువొత్తి యూరులోని ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. తనకు ఎదురు పడ్డ భారతి గొంతుకోసి అక్కడి నుంచి ఉడాయించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భారతిని కుటుంబీకులు, ఇరుగు పొరుగు వారు ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక అర్ధరాత్రి సమయలో భారతి మరణించింది. భారతి తండ్రి వేణుగోపాల్‌ ఇచ్చిన ఫిర్యాదుతో తిరువొత్తి యూరు పోలీసులు రంగంలోకి బాలాజీ కోసం గాలించడం మొదలెట్టారు. వేకువజామున పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఆ యువకుడు తానే బాలాజీ అని పేర్కొని స్పృహ తప్పాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించగా, క్రిమి సంహారక మందు సేవించినట్టు వైద్యులు తేల్చారు. దీంతో అతడికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. భారతి మరణ సమాచారంతో తానూ ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రయత్నంలో విషం తాగినట్టు నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తనను ప్రేమించి, పెళ్లికి నిరాకరించడంతో పాటు మతం మారాలన్న డిమాండ్‌ కారణంగానే గొంతు కోశానని బాలాజీ పోలీసుల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం.

>
మరిన్ని వార్తలు