వదినమ్మ ఇంట్లో దొంగలు పడ్డారు

19 Nov, 2018 09:26 IST|Sakshi
ఇలవరసి నివాసం

నగలు, వజ్రాల అపహరణ

ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు

సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ వదినమ్మ ఇలవరసి ఇంట్లో దొంగలు పడ్డారు. నగలు, వజ్రాలు వంటి ఆభరణాలు అహరణకు గురి అయ్యాయి.  ఆలస్యంగా కుటుంబీకులు పోలీసుల్ని ఆశ్రయించారు.అమ్మ జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళతో పాటు పోయెస్‌గార్డెన్‌లో ఏళ్ల తరబడి ఆమె వదినమ్మ ఇలవరసి ఉన్న విషయం తెలిసిందే. అందుకే అ›క్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళతో పాటు ఇలవరసి కూడా ఊచలు లెక్కించక తప్పలేదు. ఇలవరసికి నుంగంబాక్కం మహాలింగపురం రామనాథర్‌ వీధిలో అతి పెద్ద భవనం ఉంది. ఇందులో ఆమె కుమారుడు వివేక్‌ నివాసం ఉన్నారు. ప్రస్తుతం చిన్నమ్మ శశికళతో కలిసి వదినమ్మ ఇలవరసి పరప్పన అగ్రహార చెరలో ఉన్నారు. ఇటీవల పరోల్‌ మీద ఇలవరసి బయటకు వచ్చారు. మహాలింగపురంలోని నివాశంలోనే ఆమె ఉన్నారు. ఎనిమిదో తేదీన పరోల్‌ ముగియడంతో ఆమె మరలా పరప్పన అగ్రహార చెరకు వెళ్లారు. ఆమెతో పాటు తనయుడు వివేక్, ఇతర బంధువులు వెంట వెళ్లారు.

ఇంట్లో ఒంటరిగా ఉండ లేక వివేక్‌ భార్య అన్నానగర్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. దీంతో ఇంటి వద్ద అసోంకు చెందిన కోనార్క్‌(26) సెక్యూరిటీ మాత్రమే ఉన్నాడు. రాత్రి వివేక్‌ నమ్మిన బంటు, అంబత్తూరుకు చెందిన డ్రైవర్‌ మురళి(38) ఆ ఇంటికి వచ్చాడు. తనకు కేటాయించిన గదిలో నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు ఉదయం లేచి చూడగా, ఇంటి తలుపులు తెరచి ఉండడం, ఎవ్వరూ లేకపోవడంతో వివేక్‌ మేనేజర్‌ ప్రసన్నకు సమాచారం ఇచ్చాడు.  తొమ్మిదో తేదీ రాత్రి సమయానికి తిరిగి ఇంటికి చేరుకున్న వివేక్‌ కుటుంబీకులు అక్కడున్న గదులను పరిశీలించారు. అన్ని చోట్ల సమగ్ర పరిశీలనకు సమయం తీసుకున్నారో లేదా , చిన్న దొంగతనమే అని భావించారా ఏమోగానీ, తొలుత పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.

చివరకు ఇంట్లో ఉన్న ఆభరణాలు, వజ్రాలు మాయం కావడం , సెక్యూరిటీ కోనార్క్‌ పత్తా లేకుండా పోవడంతో శనివారం రాత్రి పోలీసుల్ని ఆశ్రయించారు. ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు అందడం అనుమానాలకు దారి తీసినా, తమ బాధ్యతగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 750 గ్రాముల బంగారం కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా, విలువైన వస్తువుల్నే అపహరించుకు వెళ్లి ఉంటారన్న అనుమానాలు బయలుదేరాయి. దీంతో రెండు ప్రత్యేక బృందాలు ఆదివారం రంగంలోకి దిగాయి. కోనార్క్‌ ఆరు నెలల క్రితం ఇక్కడకు వచ్చినట్టు విచారణలో తేలింది. దీంతో విచారణ మరింత ముమ్మరంగా సాగిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు