ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

26 Sep, 2019 13:24 IST|Sakshi
నాయుడుపేట: ప్రమాదంలో దెబ్బతిన్న ఆర్టీసీ బస్సు వెనుక భాగం

ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

నాయుడుపేట సమీపంలో ఘటన  

నెల్లూరు ,నాయుడుపేటటౌన్‌: నాయుడుపేట పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సును వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొంది. బస్సులోని ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. మంగళవారం సాయంత్రం నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరింది. ఈ బస్సులో మొత్తం 14 మంది ప్రయాణికులున్నారు. వారు నెల్లూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళుతున్నారు. బస్సు అర్ధరాత్రి సమయలో నాయుడుపేట దాటిన తర్వాత జాతీయ రహదారి కూడలి మలుపు వద్ద వెళుతుండగా చెన్నై వైపు నుంచి అతివేగంగా వస్తున్న లారీ దానిని వెనుక నుంచి ఢీకొంది. ఈ సమయంలో వెనుక భాగంలో ప్రయాణికులు లేకపోవడతో ప్రమాదం తప్పింది. అందరూ ముందువైపు ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్లు రమేష్, శరత్‌లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. బస్సును పక్కకు జరిపి జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను ఫునరుద్ధరించారు. ప్రయాణికులు వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

నెలబల్లి సమీపంలో..  
దొరవారిసత్రం: మండలంలోని నెలబల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం కారును వెనుక నుంచి టిప్పర్‌ ఢీకొంది. స్థానికుల కథనం మేరకు.. నాయుడుపేట నుంచి సూళ్లూరుపేట వైపునకు వెళుతున్న కారును వెనుక నుంచి టిప్పర్‌ ఢీకొంది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ మీదకు దూసుకెళ్లి ఆగిపోయింది. కారులోని వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

మరిన్ని వార్తలు