‘అనంత’ విషాదం

13 Apr, 2019 05:06 IST|Sakshi
మినీ బస్సు– లారీ మధ్యలో చిక్కుకున్న మహబూబ్‌బాషా మృతదేహం

మినీ బస్సును ఎదురుగా ఢీకొన్న లారీ

ఏడుగురు దుర్మరణం..మరో 10 మందికి గాయాలు

అనంతపురం జిల్లాలోని ఎర్రగుంటపల్లి వద్ద ఘటన

తనకల్లు/ నల్లచెరువు: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 42వ జాతీయ రహదారి నెత్తురోడింది. మినీ బస్సును లారీఢీకొట్టడంతో.. ఏడుగురు దుర్మరణం చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తనకల్లు– నల్లచెరువు మండలాల సరిహద్దు ప్రాంతమైన ఎర్రగుంటపల్లి సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం 7 గంటలకు 20 మందికి పైగా ప్రయాణికులతో మినీ బస్సు తనకల్లు నుంచి కదిరికి బయలుదేరింది. అయితే ఎర్రగుంటపల్లి చెరువు మలుపు వద్దకు రాగానే అనంతపురం నుంచి మదనపల్లి వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి మినీ బస్సును బలంగా ఢీ కొంది. దీంతో మినీ బస్సు ముందుభాగం నుజ్జనుజ్జయ్యింది.

ఈ ప్రమాదంలో మినీ బస్సులో ఉన్న తనకల్లుకు చెందిన పండ్ల వ్యాపారి ఖాదర్‌బాషా (43), చిట్‌ఫండ్‌ ఉద్యోగి నగేష్‌ (32), భారతమ్మ (44), కాటేపల్లికి చెందిన మహబూబ్‌బాషా (55), ఎన్‌పీ కుంట మండలం యాదుళోళ్లపల్లి జయమ్మ (48) అక్కడికక్కడే మృతి చెందారు. మినీ బస్సు– లారీ మధ్యలో చిక్కుకున్న కాటేపల్లి మహబూబ్‌బాషా మృతదేహాన్ని స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఎన్‌పీకుంట మండలం యాదుళోళ్లపల్లికి చెందిన రామచంద్రారెడ్డి (58) కదిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మరో గుర్తు తెలియని వ్యక్తి (55) తనకల్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 10 మందిలో తనకల్లుకు చెందిన బాబ్‌జాన్, రాఘవేంద్ర, శ్రీనివాసులు, మస్తాన్‌వలి, రెడ్డిశేఖర్, మహబూబ్‌బాషా, శివ గంగాదేవి, గుంజువారిపల్లి దామోదర్, మించలివారికోట శ్రీనివాసులు, కొక్కంటి క్రాస్‌కు చెందిన తిరుపాల్‌ ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కదిరి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, రూరల్‌ సీఐ రెడ్డెప్ప, ఎస్‌ఐలు రంగడు, రమేష్‌బాబు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నల్లచెరువు పోలీసులు తెలిపారు. 

మృతుల్లో నలుగురు తనకల్లు మండలం వాసులు 
మండల కేంద్రమైన తనకల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురిలో నలుగురు తనకల్లుకు చెందినవారే ఉన్నారు. అలాగే తనకల్లుకే చెందిన మరో 10 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుండటంతో గ్రామంలో విషాదం నెలకొంది. 

ఆడబిడ్డలను చదివించాలని 
తనకల్లు స్థానిక రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఉండే ఖాదర్‌బాషాకు భార్య అమ్మజాన్‌తో పాటు నగీనా, హర్షియా సంతానం. ఖాదర్‌బాషా సైకిల్‌పై పండ్ల వ్యాపారం చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. శుక్రవారం కదిరిలో పండ్లు కొనుగోలు చేసేందుకు మినీ బస్సులో బయల్దేరాడు. అయితే రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇంటి పెద్దను కోల్పోయానని, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలను ఎలా పోషించుకోవాలో అర్థం కావట్లేదని భార్య అమ్మజాన్‌ కన్నీటి పర్యంతమైంది.  

>
మరిన్ని వార్తలు