రక్తసిక్తం

20 Feb, 2019 09:56 IST|Sakshi
ఘటనా స్థలంలో ప్రశాంత్, నిఖిల్‌ మృతదేహాలు

వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ఏడుగురిదుర్మరణం

ఆర్టీసీ బస్సు ప్రమాదాల్లో ఇద్దరు..  

లారీ ఢీకొని మరో ఇద్దరు..

టిప్పర్‌ ఢీకొని యువకుడు..

బైకు అదుపుతప్పి ఇద్దరు మృత్యువాత

సిటీ రోడ్లు రక్తసిక్తం అయ్యాయి. మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, తొందరపాటు, బైక్‌ రేసింగ్‌ల
కారణంగా ఈ విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏడు కుటుంబాల్లో విషాదం నింపాయి.

రాంగోపాల్‌పేట్‌: మితిమీరిన వేగంతో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో దుర్మరణం పాలైన సంఘటన రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నెక్లెస్‌రోడ్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చింతల్‌బస్తీ నెహ్రూనగర్‌కు చెందిన అశోక్‌ కుమారుడు ప్రశాంత్‌ (19), కృష్ణ కుమారుడు నిఖిల్‌ (19) స్నేహితులు. వారిద్దరూ హిమాయత్‌నగర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం కాలేజీకి సెలవు కావడంతో మధ్యాహ్నం  నిఖిల్‌ తన తండ్రి బైక్‌ తీసుకుని ప్రశాంత్‌తో కలిసి నెక్లెస్‌రోడ్‌కు వచ్చాడు. పలు ప్రాంతాల్లో తిరిగిన వీరు జలవిహార్‌ నుంచి ప్రసాద్‌ ఐ మ్యాక్స్‌ వైపు వెళుతున్నారు. నిఖిల్‌ అతి వేగంగా బైక్‌ నడుపుతుండటంతో నెక్లెస్‌రోడ్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో వీరి వాహనం అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న ప్రశాంత్‌ను రాంగోపాల్‌పేట్‌ పోలీసులు కిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. రాంగోపాల్‌పేట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

బస్సు ఢీకొనిగుర్తు తెలియని వ్యక్తి మృతి
బంజారాహిల్స్‌: ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమవారం రాత్రి కృష్ణానగర్‌ మెయిన్‌ రోడ్డులో ఓ వ్యక్తి(48) రోడ్డు దాటుతుండగా యూసుఫ్‌గూడ వైపు నుంచి వస్తున్న కూకట్‌పల్లి డిపోకు చెందిన బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘట నా స్థలానికి చేరుకున్న పోలీసులు  మృతుడి వివరాల కోసం ఆరా తీశా రు. అతడి వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ చక్రపాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరి ప్రాణం తీసిన రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌
అడ్డగుట్ట: రాంగ్‌రూట్‌లో నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు వ్యక్తులు లారీని ఢీ కొని మృతి చెందిన సంఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...జనగాంకు చెందిన సోమరాజు(32), వరంగల్‌కు చెందిన నవీన్‌(47) కూలీలుగా పని చేసేవారు. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చిన వీరు తార్నాక, విజయపురి కాలనీలో ఉంటున్నారు. మంగళవారం ఉదయం పని నిమిత్తం బైక్‌పై ముషీరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో విజయపురి కాలనీ నుంచి యాక్సిక్‌ బ్యాంకు మీదుగా మెట్టుగూడ వైపు రాంగ్‌ రూట్‌లో వెళ్తుండగా ఎదురుగా గ్యాస్‌ సిలిండర్ల లోడ్‌తో వస్తున్న లారీని ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరూ కిందపడిపోవడంతో నవీన్‌  రోడ్డును రాసుకుంటూ లారీ వెనుకటైరు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సోమరాజును స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న లాలాగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బైక్‌ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు
బంజారాహిల్స్‌: బైక్‌ అదుపు తప్పి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాల ఇలా ఉన్నాయి..గుంటూరు జిల్లా, కర్లపాలెంకు చెందిన సాయి వెంకటేష్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సు నేర్చుకుంటూ ఎస్‌ఆర్‌నగర్‌లోని ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. సోమవారం రాత్రి అతను తన స్నేహితుడు రోహన్‌గాంధీతో కలిసి బైక్‌పై బంజారాహిల్స్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ సమీపంలో బైక్‌ అదుపుతప్పడంతో   ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొన్నారు. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న వెంకటేష్‌తో పాటు వెనక కూర్చున్న రోహన్‌కు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు వారిని సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

టిప్పర్‌ ఢీకొని యువకుడి మృతి
దుండిగల్‌: టిప్పర్‌ ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శంకరయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. దుండిగల్‌ గ్రామానికి చెందిన శివకుమార్‌ (24) మంగళవారం సాయంత్రం బైక్‌పై బౌరంపేటలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళుతుండగా బౌరంపేట గ్రామంలో మల్లం పేట వైపు నుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ అతడి బైక్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన శివకుమార్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొనియువకుడి దుర్మరణం
బంజారాహిల్స్‌: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌ నుంచి బోరబండకు వస్తున్న రాణిగంజ్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు కిందపడిపోయారు. మజీదులో ఇమామ్‌గా పన చేస్తున్న మహ్మద్‌ ముస్తాహిర్‌ హుస్సేన్‌(21) అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక కూర్చున్న అతని స్నేహితుడు రేహాన్‌ హుస్సేన్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వార్తలు