ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

31 Jan, 2019 12:14 IST|Sakshi
హతుడు దయాసాగర్‌(ఫైల్‌)

విద్యార్థి దారుణ హత్య

కళాశాలలోనే స్నేహితుడిపై చాకుతో విచక్షణారహితంగా దాడి

బెంగళూరులో ఘటన

కర్ణాటక, యశవంతపుర: ఓ యువతి విషయంపై ఇద్దరు కళాశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసిన ఘటన నగరంలోని బాగలగుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. వివరాలు... ఇక్కడి రామయ్య లేఔట్‌లోని సౌందర్య కళాశాలలో దయాసాగర్, రక్షిత్‌లు ద్వితీయ పీయూసీ చదువుతున్నారు. అదే కళాశాలలో చదువుతున్న అమ్మాయిని వీరు ఇద్దరు ప్రేమిస్తున్నారు. బుధవారం ఉదయం ఇద్దరు కళాశాలకు వచ్చారు.

ప్రేమ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. సహచర విద్యార్థులు అడ్డుకున్నారు. అనంతరం దయాసాగర్‌ సమీపంలోని వాష్‌రూమ్‌ వద్దకు వెళ్లాడు. అంతకు ముందే చాకుతో వచ్చిన రక్షిత్‌ దయాసాగర్‌పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న దయాసాగర్‌ను కళాశాల సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండగానే దయాసాగర్‌ మృతి చెందాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు