లెక్క తేలుతోంది!

17 Dec, 2018 09:23 IST|Sakshi

ఎన్నికల్లో సీజ్‌ చేసిన నగదుపై యంత్రాంగం దృష్టి

ఇప్పటికే వీగిపోయిన 13 కేసులు యజమానులకు నగదు అప్పగింత

రూ.10 లక్షలు పైబడిన కేసులను తేల్చేపనిలో ఇన్‌కం టాక్స్‌శాఖ

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వెలువడ్డాయి. మరి జిల్లావ్యాప్తంగా తనిఖీల్లో పట్టుబడిన సొమ్మంతా ఎక్కడికి పోతుంది? ఎవరి అధీనంలో ఉంటుంది? తిరిగి బాధితులకు అందజేస్తారా? లేక ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారా? సామాన్యుల్లో ఈ తరహా ప్రశ్నలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ లెక్కలు తేలుతున్నాయి. తాజాగా ముగిసిన శాసనసభ ఎన్నికల్లో నోట్ల కట్టలు స్వైర విహారం చేసిన విషయం తెలిసిందే. ఓట్లు దండుకోవడానికి ఆయా పార్టీల నేతలు పోటీపడి మరీ కోట్ల రూపాయలు గుమ్మరించారు. ఇందుకోసం ఎన్నికల సంఘం సూచించిన నిర్దేశిత మొత్తానికి మించి ఎటువంటి ఆధారాలు లేకుండా వివిధ మార్గాల్లో.. పలు రూపాల్లో డబ్బును రాజకీయ నాయకులు తరలించారు. విస్తృతంగా తనిఖీ చేసిన ఫ్లయింగ్‌ స్క్వాడ్, పోలీసులు, స్టాటిక్‌ సర్వీలేన్స్‌ బృందాలు (ఎస్‌ఎస్‌టీ) పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నాయి. కొన్ని కేసులు వీగిపోగా.. మరికొన్నింటిపై విచారణ జరగాల్సి ఉంది. ఇంకొన్ని కేసులు ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వెళ్లాయి.  

వీగిన కేసులు 13
రూ.10 లక్షలు లోబడి స్వాధీనం చేసుకున్న సొమ్మును జిల్లా ట్రెజరీ అధికారి (డీటీఓ) వద్ద భద్రపరిచారు. ఇటువంటి కేసులు జిల్లావ్యాప్తంగా 26 నమోదయ్యాయి. రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) ఎండార్స్‌ చేసిన పత్రం, పంచనామా, ఎన్నికల సంఘానికి వివరాలు అప్‌లోడ్‌ చేసిన ధ్రువపత్రాన్ని కూడా డీటీఓకు అందజేశారు. డబ్బు వ్యవహారంపై డీఆర్‌ఓ అధ్యక్షతన ఏర్పడిన ప్రత్యేక కమిటీ చర్చించనుంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికే తరలిస్తున్నారా? ఇతర అవసరాలకు తీసుకెళ్తున్నారా? అని ఆరా తీస్తుంది. వ్యక్తిగత సొమ్మే అని తేలితే.. సదరు కేసులను అక్కడితో మూసేస్తారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 13 కేసులు వీగిపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇవన్నీ వ్యక్తగత, వ్యాపార లావాదేవీల నిమిత్తం నగదు తరలిస్తున్నట్లు అధికారుల విచారణలో స్పష్టమైంది. మిగిలిన కేసులపై త్వరలో విచారణ జరగనుంది. రూ.పది లక్షలకు పైబడి పట్టుబడిన కేసులన్నీ ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వెళ్తాయి. పదుల సంఖ్యలో నమోదైన ఈ తరహా కేసులను ఆ శాఖ అధికారులకు అప్పగించడంతో విచారణ చేపడుతున్నారు. ఆ నగదుకు సంబంధించి గతంలో పన్ను చెల్లించారా? లేదా హవాలా మార్గంలో వచ్చిందా? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు. నిబంధనల ప్రకారం ఉంటే డబ్బును యజమాని తీసుకోవచ్చు. లేకపోతే సర్కారు ఖజానాలో జమచేస్తారు.   

భారీగా నగదు స్వాధీనం..
ఎన్నికలు పూర్తయ్యే నాటికి జిల్లావ్యాప్తంగా రూ.3.84 కోట్లను సీజ్‌ చేసినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలు చేయడంతోపాటు ఎస్‌ఎస్‌టీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. సివిల్‌ పోలీసులూ ఎక్కడికక్కడ సోదాలు చేసి పెద్దమొత్తంలో డబ్బులను సీజ్‌ చేశారు. ఎన్నికల సమయంలో రూ. 40 వేలు, ఆపైబడి మొత్తం ఎవరి వద్దనైనా లభ్యమైతే అందుకు సంబంధించిన లెక్కలు చూపడంతోపాటు తగిన ఆధారాలను సైతం అందజేయాలి. ఈ ఉల్లంఘనను అతిక్రమించి నగదు తరలిస్తున్న వారిని అదుపులోకి డబ్బును సీజ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు