పెళ్లింట విషాదం..శుభకార్యానికి చేరుకునేలోపే.. | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం..శుభకార్యానికి చేరుకునేలోపే..

Published Mon, Dec 17 2018 9:35 AM

Tractor Accident In Mahabubnagar One Killed And Several Injured - Sakshi

ఊర్కొండ:  పెళ్లి ప్రయాణం విషాదంగా మారింది. శుభకార్యానికి చేరుకునేలోపే అనుకోని ఘటనతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఊర్కొండ ఎస్‌ఐ కృష్ణయ్య, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం...  మండల పరిధిలోని ఊర్కొండపేటకు చెందిన బంధువులు, రాచాలపల్లిలో జరిగే పెళ్లికి హాజరయ్యేందుకు ట్రాక్టర్‌లో ప్రయాణమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బయలుదేరారు. పెళ్లికూతురు పెదనాన్న తాడూర్‌ మండలం ఆకునెల్లికుదురు గ్రామానికి చెందిన బరిగెల బాలయ్య(60) (పెద్దమ్మ భర్త) ఊర్కొండ ప్రధాన స్టేజీ వద్ద ట్రాక్టర్‌ ఎక్కారు. అనంతరం డ్రైవర్‌ వేగంగా, అశ్రద్ధగా నడుపుతుండటంతో తగ్గాలని హెచ్చరించారు.

అయినా అతను వినకుండా వెళ్తుండటంతో ఊర్కొండ శివారులో బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 32మందికి గాయాలయ్యాయి. ఇంజన్‌ భాగంలో కూర్చున్న బరిగెల బాలయ్య ట్రాక్టర్‌ ముందుభాగం చక్రంలో ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డారు. వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన అంజలి అనే వివాహిత కుడిచేయి మోచేతి వరకు తెగిపడింది. మరో వివాహిత రజిత కాళ్ల మధ్యలో చర్మం పూర్తిగా తెగిపడింది. అలాగే పద్మ, బాలకిష్టమ్మ, అంజమ్మ, అమృత, పార్వతమ్మ, లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు. 

కల్వకుర్తికి క్షతగాత్రులు  
ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు తెలియజేశారు. వెంటనే చేరుకున్న వారు క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం  నలుగురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రి వైద్యులు సిఫారసు చేశారు. వైద్యం అందిస్తుండగానే బరిగెల బాలయ్య మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు. 108 వాహనం రావడం లేటవడంతో, పోలీసులు తమ వాహనంలోనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  

క్షతగాత్రులకు పరామర్శ  
కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రి బాధితులతో పూర్తిగా నిండిపోయింది. వారి రోదనలు మిన్నంటాయి. క్షతగాత్రులను కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి, సీఐ సురేందర్‌ రెడ్డి పరామర్శించారు. పూర్తి వివరాలను ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement