గ్యాంగ్‌స్టర్‌ హత్యకు 10 కోట్ల సుపారీ..!

14 Jul, 2018 09:48 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌ జైల్లో దారుణ హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్‌ మున్నా భజరంగీ కేసులో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌ రాతి, భజరంగీ తనను హేళన చేయడం వల్లే అతన్ని హత్య చేశానని చెప్పడం కట్టుకథ అనే విషయం పోలీసుల విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఈ కేసులో లోతైన దర్యాప్తు చేపట్టారు.  ఈ కేసు విచారణపై ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. భజరంగీని హత్య చేయడానికి తూర్పు యూపీకి చెందిన ఓ రాజకీయ నాయకుడు(మాజీ ఎంపీ) పది కోట్ల రూపాయల సుపారీ అందించినట్టు తెలిందన్నారు. భజరంగీ హత్యకు ముందురోజు జౌన్‌పూర్‌లోని రెండు బ్యాంక్‌ల్లో ఈ మొత్తం జమ అయినట్టు గుర్తించామన్నారు.

అదే విధంగా ఈ రెండు ఖాతాలతో ఆ రాజకీయ నాయకుడికి పరోక్షంగా సంబంధం ఉందని పేర్కొన్నారు. భజరంగీ హత్యకు కొన్ని రోజుల ముందు అతని భార్య సీమా నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా అతని పేరు వెల్లడించారని సూచన ప్రాయంగా తెలిపారు. ఆ రాజకీయ నాయకుడు కూడా ఒకప్పటి గ్యాంగ్‌స్టర్‌ అని, దీంతో భజరంగీకి అతనికి మధ్య పాత కక్షలు ఉన్నట్టు తమ విచారణలో తెలిందన్నారు. అంతేకాకుండా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విషయంలో ఆ నాయకుడు భజరంగీపై కోపం పెంచుకున్నాడని.. దీంతోనే అతన్ని హత్య చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసినట్టు తెలుస్తోందన్నారు.

భజరంగీ హత్య అనంతరం తనకు సుఫారీ ఇచ్చిన వారితో సునీల్‌ ఫోన్‌ ద్వారా సంప్రదింపులు జరిపినట్టు ఆధారాలు లభించాయని ఆయన వెల్లడించారు. విచారణ బృందం కూడా జైల్లోకి మొబైల్‌, తుపాకీ ఎలా వచ్చాయనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. కాగా భాగ్‌పత్‌ జైల్లో ఉన్న సునీల్‌ను ఫతేఘర్‌ సెంట్రల్‌ జైలుకు తరలించాలని శుక్రవారం యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

మరిన్ని వార్తలు