ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య

9 Mar, 2018 07:45 IST|Sakshi
శావణి , భార్గవి పటేల్‌ , విషాదంలో భార్గవి పటేల్‌ కుటుంబ సభ్యులు

ఎల్‌బీనగర్‌ చిత్ర లేఅవుట్‌లో విషాదం

నాగోలు: ఇద్దరు ప్రాణ స్నేహితులు.. చదువులో టాపర్స్‌..సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు.. ఇంగ్లిష్‌ పరీక్ష చదుకునేందుకు వెళ్లిన ఆ ఇద్దరూ ఏమి జరిగిందో తెలియదు..ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన ఎల్‌బీనగర్‌ ఠాణా పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఏలో సైంటిస్టుగా పనిచేస్తున్న మహారాష్ట్ర అహ్మదాబాద్‌కు చెందిన నరేందర్‌ ఖాలే తన కుటుంబసభ్యులతో కలిసి ఎల్‌బీనగర్‌ చిత్ర లేఅవుట్, మంజీరా హైట్స్‌ ఫేజ్‌–1 704లో ఉంటున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు తేజస్సు ఇంటర్మీడియట్‌ చదువుతుండగా, కూతురు శావణి ఖాలే (15) సాగర్‌రింగ్‌ రోడ్డు సమీపంలోని అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో సీబీఎస్‌ఈలో పదో తరగతి చదువుతోంది.

అయితే ఎల్‌బీనగర్‌ బహూదూర్‌పూర టీఎన్‌ఆర్‌ వైష్ణవి శిఖర అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే క్రాంతిపటేల్, కళావతి దంపతుల నాలుగో కూతురు భార్గవి పటేల్‌ (15) కూడా అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతుంది. ఇక్కడ శావణితో ఏర్పడిన పరిచయంతో ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారారు. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఈ నెల ఆరో తేదీన ప్రారంభమయ్యాయి. అయితే హిందీ పరీక్ష రాసి ఈ నెల 12న జరిగే ఇంగ్లిష్‌ పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం భార్గవి కలిసి చదువుకుందామని ఫోన్‌కాల్‌ చేయడంతో శావణి చిత్ర లేఅవుట్‌ నుంచి ఎల్‌బీనగర్‌లోని  వైష్ణవి శిఖర అపార్ట్‌మెంట్‌లోని ఎనిమిదో అంతస్తులోని 805 ఫ్లాట్‌కు వెళ్లింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో భార్గవి తల్లిదండ్రులు కూరగాయల కోసం బయటకు వెళ్లారు.

కొంత సమయానికే శావణి, భార్గవి ఎనిమిదో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గమనించిన సెక్యూరిటీ వారి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహలను పరిశీలించారు. వారు చదువుకున్న రూమ్‌ను పరిశీలించగా శావణికి చెందిన సూసైడ్‌నోట్‌ దొరికింది. అందులో ఐమిస్‌ యూ తేజ్‌...పప్పా మమ్మీ సారీ అని రాసి ఉంది. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరు మృతదేహలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా శావణి బిల్డింగ్‌ పై నుంచి దూకే క్రమంలో భార్గవి పట్టుకోబోయి కింద పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు చదువులో ముందుండేవారని, ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యేవారని మృతుల బంధువులు తెలిపారు.  రెండు అపార్ట్‌మెంట్లలోని ఇళ్లలో ఈ ఘటనతో విషాదం నెలకొంది. ఘటనాస్థలికి ఎల్‌బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ పృథ్వీధర్‌ రావు, సీఐ కాశీరెడ్డి పరిశీలించారు.

మరిన్ని వార్తలు