రూ.కోటికి పైగా చోరీ సొత్తు స్వాధీనం

7 Oct, 2017 03:03 IST|Sakshi

18 మంది దొంగల అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన అదనపు పోలీస్‌ కమిషనర్‌ మాలిని కృష్ణమూర్తి

బనశంకరి: చోరీలు, చైన్‌స్నాచింగ్‌ తదితర 73  కేసులను  పశ్చిమవిభాగం పోలీసులు ఛేదించారు. ఈమేరకు 18 మంది దొంగలను   అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ. కోటి ఏడులక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను అదనపు పోలీస్‌ కమిషనర్‌ మాలిని కృష్ణమూర్తి  శుక్రవారం మీడియాకు     వెల్లడించారు.గాయత్రినగర నివాసి హర్ష, మహేంద్రరావ్‌ అనే ఇద్దరు ప్రముఖ చైన్‌స్నాచర్లును బసవేశ్వరన గర పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి కిలో 252 గ్రాముల బంగారు చైన్లు స్వాధీనం చేసుకున్నారు. బసవేశ్వరనగర, విజయనగర, చంద్రాలేఔట్, మల్లేశ్వరం, రాజాజీనగర ప్రాంతాల్లో నిందితులు 26 చోట్ల చైన్‌స్నాచింగ్‌లకు తెగబడ్డారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న లగ్గెరె నివాసి సతీశ్‌ అలియాస్‌గొణ్ణె అనే  దొంగను బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్‌ చేసి రూ.13 లక్షల 59 వేల విలువైన 452 గ్రాముల  బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.  బసవేశ్వరనగర, మహాలక్ష్మీలేఔట్‌లో నిందితుడు 12 చోట్ల చోరీకి     పాల్పడ్డాడు. కాటన్‌పేట పోలీసులు జహీర్‌అలియాస్‌ షకీల్‌ అనే దొంగను అరెస్ట్‌ చేసి రూ.8లక్షల 20 వేల విలువైన   368 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.  కాటన్‌పేటలోని ఓల్డ్‌ ఫంక్షన్‌ మొహల్లా, కాటన్‌పేటలోని ఏడు ఇళ్లలో నిందితుడు చోరీలకు పాల్పడ్డాడు.

సెల్‌ఫోన్‌ దొంగల అరెస్ట్‌
సిటీమార్కెట్, గాంధీబజార్‌ ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడుతున్న భద్రావతికి చెందిన రాఘవేంద్ర, కిరణ్, శ్రీనివాస్, రవి, హరీశ్, సునీల్, నీలసంద్ర నివాసి శివమూర్తిలను ఉప్పారపేటేపోలీసులు అరెస్ట్‌ చేసి రూ.6 లక్షల 50 వేల విలువైన 57 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

జేబుదొంగల అరెస్ట్‌
ప్రయాణికుల ముసుగులో చోరీకి పాల్పడుతున్న సర్జాపుర నివాసి రవిఅలియాస్‌ ఆదినారాయణ, ఆనేకల్‌కు చెందిన మనుకుమార్‌ అలియాస్‌ మను, శంకర్‌లను పశ్చిమవిభాగం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ.30 లక్షల 10 వేల విలువ చేసే  కిలో 38 గ్రాముల  బంగారుఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.  అదేవిధంగా భద్రావతికి చెందిన ప్రేమ్‌కుమార్‌ అనే దొంగను ఉప్పారపేటే పోలీసులు అరెస్ట్‌ చేసి  రూ.2 లక్షల 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

బ్యాగ్‌ దొంగల అరెస్ట్‌ ...
తాళం వేసిన ఇళ్లలో, ప్రయాణికుల బ్యాగులను తస్కరించే శివాజీనగర నివాసి నయాజ్‌ఖాన్, నీలసంద్రకు చెందిన ఆసిప్‌హుస్సేన్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి రూ.12 లక్షల విలువైన 400 గ్రాము బంగారుఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.విలేకరుల సమావేశంలో  డీసీపీ చేతన్‌సింగ్‌రాథోడ్‌ ఉన్నారు.   

>
మరిన్ని వార్తలు