చూడలేకపోతున్న ‘మూడో కన్ను’..

1 Jun, 2018 08:21 IST|Sakshi

జంగంపల్లిలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన దారుణం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఒకేసారి ఇద్దరు హత్యకు గురికావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామంలో సీసీ కెమెరాలు ఉన్నా.. అవి పంచాయతీ పరిసరాల్లోనే ఉండడంతో నేరాన్ని రికార్డు చేయలేకపోయాయి. ఆర్థికభారం కావడంతో గ్రామంలో వేరే చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు.. గ్రామ పోలీస్‌ అధికారి వ్యవస్థ కూడా నిర్వీర్యం కావడంతో నేరాలు పెరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

భిక్కనూరు : ప్రశాంతంగా నిద్రపోతున్న పల్లె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జంగంపల్లి వీడీసీ అధ్యక్షుడు అత్తెలి రమేశ్, మరో వ్యక్తి ముదాం రాములు దారుణంగా హత్యకు గురైన ఘటన గ్రామంలో కలకలం రేపింది. ప్రతి గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారులు గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను ఏర్పాటు చేశారు. చిన్నచిన్న వివాదాలే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా మారుతాయని భావించిన పోలీసు అధికారులు.. వాటిని నివారించడం కోసం ప్రతి గ్రామానికి పోలీసు అధికారిని నియమించారు. గ్రామంలోని గోడలపై గ్రామ పోలీస్‌ అధికారి పేరు, ఫోన్‌ నంబర్‌ రాయించారు. ఆ గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే గ్రామ పోలీస్‌ అధికారికి సమాచారం వెళ్లేది. మొదట్లో ఈ వ్యవస్థ సత్ఫలితాలు ఇచ్చినా.. ఆ తర్వాత ఈ వ్యవస్థను పట్టించుకోవడం మానేశారు. గ్రామ పోలీస్‌ అధికారి వ్యవస్థ నామ్‌కే వాస్తేగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వారు పల్లెలవైపు చూడడం లేదని తెలుస్తోంది.

 కొనుగోలు భారం..

నేరాల నియంత్రణకు పోలీసులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, వాటిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే వాటిని కొనుగోలు చేయడానికి పంచాయతీల వద్ద ఎలాంటి నిధులు లేవు. దాతలు ముందుకు వస్తే ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల కొనుగోలు భారం కావడంతో చాలా గ్రామాలు వీటి ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల నాలుగైదు కెమెరాలు మాత్రమే ఏర్పాటు చేశారు. అవి పంచాయతీ వద్దో.. కూడళ్లలోనే ఉన్నాయి. అంతగా సీసీ కెమెరాలు లేకపోవడంతో మిగతా చోట్ల నేరాలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడం కష్టంగా మారుతోంది.

 గ్రామ ముఖద్వారం వద్ద లేకపోవడంతో..

భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో గతంలో దుండగులు అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గ్రామంలో సీసీ కేమెరాలు ఉన్నాయి. కానీ గ్రామ ముఖద్వారం వద్ద ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడంతో పోలీసులు దుండగుల ఆచూకీ కనుక్కోలేకపోయారు. జంగంపల్లిలోనూ సీసీ కెమెరాలున్నా.. గ్రామ ముఖద్వారం వద్ద ఒక్కటీ లేకపోవడంతో హంతకులను గుర్తించలేకపోయారు.

అక్కరకు రాని కెమెరాలు..

సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలను సులువుగా ఛేదించవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అవి నాణ్యమైనవి కాకపోవడంతో తరచుగా చెడిపోతూ సరిగా పనిచేయడం లేదని తెలుస్తోంది. భిక్కనూరు మండలంలోని జంగంపల్లిలో జంట హత్యలు జరిగిన ప్రదేశానికి సమీపంలో గ్రామ స్వాగత తోరణం ఉన్నప్పటికీ అక్కడ సీసీ కేమెరాలు లేవు. గ్రామపంచాయతీ సమీపంలోనే నాలుగు సీసీ కేమేరాలు ఉన్నాయి. అవి కూడా చెడిపోవడంతో ఇటీవల పోలీసుల సూచన మేరకు మరమ్మతులు చేయించారు. ఈ మరమ్మతులు చేయించిందీ హత్యకు గురైన అత్తెల్లి రమేశ్‌ కావడం గమనార్హం. సీసీ కెమెరాలను ప్రారంభ కార్యక్రమాల్లో పోలీసులు కనబడతారు కానీ వాటి పనితీరు ఎలా ఉందో అని మాత్రం తెలుసుకోరని ప్రజలు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ప్రారంభించడడమే కాదు వాటి పనితీరు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలంటూ ప్రజలు కోరుతున్నారు.  

పోలీసులకు సవాల్‌..

 సంఘటన స్థలంలో లభించే చిన్న క్లూతోనయినా పోలీసులు నేరాన్ని ఛేదిస్తారు. జంగంపల్లి జంట హత్యల కేసులో మాత్రం హంతకులు హతుల సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. ఇద్దరిని చంపిన హంతకులు.. హతుల ఫోన్‌లను తీసుకుని జాతీయ రహదారి మీదుగా పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసు జాగిలం కూడా జాతీయ రహదారి వద్దకు వచ్చి ఆగిపోయింది. ఈ హత్య కేసు మిస్టరీ కూడా ముందుకు సాగడం లేదు.

భయాందోళనల్లో గ్రామస్తులు

 జంట హత్యలు జంగంపల్లివాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎవరిని కదిలించినా భయంభయంగా మాట్లాడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో జంట హత్యలు కల్లోలం రేపాయని పేర్కొంటున్నారు. పదేళ్ల క్రితం గ్రామ శివారులో గ్రామానికి చెందిన దుమాల బాలవ్వ హత్యకు గురైంది. ఆ సంఘటన తర్వాత బుధవారం వేకువ జామున జరిగిన హత్యల సంఘటనే పెద్ద సంఘటనగా చెప్పవచ్చు. మృతులు రమేశ్, రాములు వరుసకు బావమరుదులు అయినప్పటికీ వారి మధ్య పెద్దగా సాన్నిహిత్యం లేదు. ఏడాది క్రితం భూమి విషయంలో రమేశ్‌తో రాములు వాగ్వాదానికి దిగాడని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేవని గ్రామస్తులు తెలిపారు. అయితే వీరిరువురు హత్యకు మూడు రోజుల ముందు నుంచే మత్తడి పోచమ్మ ఆలయం వద్ద బోనాలు తీసే విషయమై మాట్లాడుకుంటున్నారని తెలిసింది. ఈ ఇద్దరూ హత్యకు గురికావడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

 హంతకులను పట్టుకునేందుకు.. 

జంట హత్యల కేసుపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె గురువారం ఉదయం సంఘటన స్థలాన్ని మరోమారు సందర్శించారు. హత్య జరిగిన చుట్టుపక్కల ప్రదేశాలనూ పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. హంతకులను పట్టుకునేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

జంగంపల్లి పంచాయతీ వద్దనున్న సీసీ కెమెరా 

మరిన్ని వార్తలు