తిరుత్తణి హత్య కేసు: నిందితుడు అరెస్ట్‌

18 Aug, 2019 21:34 IST|Sakshi
మహేష్‌(ఫైల్‌),  నడి వీధిలో కత్తులతో యువకుడిపై దాడి చేస్తున్న దుండగులు

తిరుత్తణి : కోర్టు ఎదుట పట్టపగలు నడి రోడ్డున హంతకుల ముఠా యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన తిరుత్తణిలో శుక్రవారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించి నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తుండగా ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  తిరుత్తణి అరక్కోణం రోడ్డు మార్గంలో సంయుక్త కోర్టుకు ఎదురుగా నిత్యం రద్దీగా దర్శనమిచ్చే రోడ్డులో యువకుడిని నలుగురు సభ్యుల ముఠా కత్తులతో తరిమి అతి కిరాతకంగా హోటల్లో హత్య చేసి పరారైన ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తులో హత్యకు గురిౖయెన వ్యక్తి  తిరువళ్లూరు సమీపం పెరుమాళ్‌పట్టు గ్రామానికి చెందిన శివగురుమూర్తి కుమారుడు మహేష్‌(25) అని డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్యోగి అని తెలిసింది.

గత 2018లో పొంగల్‌ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్‌ పోటీల్లో మహేష్‌ వర్గానికి చెన్నైకు చెందిన రౌడీలల్లూ వర్గానికి మధ్య గొడవలు చోటుచేసుకున్నట్లు, ఈ ఘటన ఇరు వర్గాల్లో  వైర్యాన్ని పెంచినట్లు, ఇందులో భాగంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మహేష్‌ మిత్రులు శుక్రవారం తిరుత్తణి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరిచేందుకు వస్తున్న విషయం తెలుసుకుని ప్రత్యర్థులు హత్యకు కుట్రపన్నారు. నలుగురు యువకులు నడి రోడ్డులో తరమడంతో భయంతో హోటల్లో తలదాచిన మహేష్‌ను కత్తులతో దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి డీఎస్పీ శేఖర్‌ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ప్రధాన నిందితుడుగా భావించే పెరుమాళ్‌పట్టుకు చెందిన పళనిస్వామి కుమారుడు విమల్‌(22) అనే యువకుడిని అరెస్ట్‌ చేశారు. మిగిలిన నిందుతుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు