చెల్లి పెళ్లి చూడకుండానే..

21 Mar, 2020 13:29 IST|Sakshi
మృతి చెందిన జయలక్ష్మి(ఫైల్‌) మృతి చెందిన జగదీష్‌ (ఫైల్‌)

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరు జిల్లా వాసుల దుర్మరణం

కారు–లారీ ఢీ నరసన్నపేటలో విషాదం  

శ్రీకాకుళం, పెందుర్తి: ఎన్‌హెచ్‌–16 బైపాస్‌ ఆనందపురం–అనకాపల్లి రహదారి మరోసారి రక్తమోడింది. పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు శ్రీకాకుళం వాసులు దుర్మరణం పాలయ్యారు. లారీ–కారు ఢీకొన్న ఘటనలో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నరసన్నపేటకు చెందిన గనగళ్ల జగదీష్‌ (24), బంధువు జల్లేపల్లి జయలక్ష్మి(65) కుటుంబాలు కలిసి మెలిసి ఉంటాయి. వీరికి సన్నిహిత కుటుంబం పెందుర్తిలో నివాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పెందుర్తిలోని వారింట్లో శుభకార్యానికి మీనాక్షమ్మ, జగదీష్‌ కారులో వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత తిరిగి శ్రీకాకుళం బయలుదేరారు. అయితే పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం మలుపు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్‌ చేస్తున్న జగదీష్, ముందు సీట్లో ఉన్న మీనాక్షమ్మ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులో చిక్కుకుపోయిన మీనాక్షమ్మ, జగదీష్‌ మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

చెల్లి పెళ్లి చూడకుండానే..
నరసన్నపేట: పెందుర్తి రోడ్డు ప్రమాదంలో గనగళ్ల జగదీష్, బంధువు జల్లేపల్లి జయలక్ష్మి మృతి చెందడంతో నరసన్నపేట పట్టణం బజారు వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వచ్చే నెల 15న తన చెల్లి పెళ్లి అంగరంగ వైభవంగా చేయడానికి జగదీష్‌ నెల రోజులుగా బిజీగా ఉన్నాడు. ఇంతలోనే మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడు జగదీష్‌ మాజీ వార్డు సభ్యుడు శ్రీను కుమారుడు. ఈయన ఇంటి ఎదురుగా ఉంటున్న జయలక్ష్మి కూడా మృతి చెందడంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఆనందపురం దాటాక తండ్రి శ్రీనుతో ఫోన్లో మాట్లాడిన జగదీష్‌ అక్కడికి కొద్ది నిమషాల తర్వాత ప్రమాదానికి గురయ్యాడు. సాయంత్రం మూడు గంటలకు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

మంత్రి కృష్ణదాస్‌ సంతాపం...
రోడ్డు ప్రమాదంలో జగదీష్‌తోపాటు జయలక్ష్మి మృతి చెందడం పట్ల ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కృష్ణచైతన్య, పార్టీ నాయకులు ఆరంగి మురళి, కేసీహెచ్‌బీ గుప్తా తదితరులు సంతాపం తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా