బాబాయి.. బాలిక హత్య?

18 Oct, 2017 09:59 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న తెనాలి డీఎస్పీ ఎం.స్నేహిత, ఇన్‌చార్జి సీఐ కల్యాణరాజు, బైకుపై బాలిక చరితాచౌదరి

కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ సంఘటన

ఈ దిశగా విచారణ జరుపుతున్న పోలీసులు

అమృతలూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఐదేళ్ల బాలిక, ఆమె బాబాయి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం సంచలనం రేకెత్తించింది. అమృతలూరు–పెదపూడి గ్రామాల మధ్య తెనాలి–చెరుకుపల్లి ఆర్‌అండ్‌బీ రహదారి పక్కనే చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. అమృతలూరుకు చెందిన రాపర్ల సుబ్బి కృష్ణ, ఝాన్సీవల్లి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సురేష్‌ బాబుకు వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమారుడి సతీష్‌ వివా హం అయి ఏడాది కూడా పూర్తి కాలేదు. సోదరులిద్దరూ గత కొన్నేళ్లుగా గ్రామ దేవత పుట్లమ్మ తల్లిగుడి పక్కనే ఉన్న షాపును అద్దెకు తీసుకొని ఎరువులు, పురుగు మందుల దుకాణ వ్యాపారం సాగిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాపర్ల సతీష్‌కు, యలవర్రులో ఎస్సీ మాల వర్గానికి చెందిన సజనకుమారితో పెద్దల వివాహం ఈ ఏడాది మార్చి లో చేశారు. అయితే వివాహమైన కొద్ది కాలానికే కుటుంబాల మధ్య కలహాలు రావడంతో దంపతులిద్దరూ విడివిడిగా వారి గ్రామాల్లో ఉంటున్నారు. మధ్యలో భార్య తాలూకు పెద్దలు అమృతలూరులోని సతీష్‌ కుటుంబం వద్దకు వచ్చి మా ట్లాడినా వారి చర్చలు విఫమయ్యాయి. దీంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు.

ఏం జరిగింది?
రాపర్ల సతీష్‌కు అన్న రెండో కుమార్తె చరితాచౌదరి అంటే ఎనలేని ప్రేమ. ఎక్కడకు వెళ్లినా వెంటబెట్టుకుపోÄయేవాడు. ఈ నేపథ్యంలో ఎరువుల షాపు కావడంతో తెనాలిలో ఆడిట్‌ ఉందని, దీపావళి సామగ్రిని పిల్లలకు తీసుకువస్తానని చరితాచౌదరిని మోటార్‌ సైకిల్‌పై ఎక్కించుకుని సోమవారం సాయంత్రం తెనాలికి పయనమయ్యాడు. రాత్రికి కూడా రాకపోవడంతో సతీష్‌కు ఫోన్‌ చేశారు. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో, కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. తెనాలి వైపు రోడ్డుకు ఇరువైపులా వెతుకులాట సాగించారు. అయినా వారి జాడ కనిపించలేదు. తెల్లారైనా ఇంటికి చేరుకుంటారని ఎదురు చూస్తున్నారు. ఇంతలో పొలాల వైపు వెళ్తున్న కొందరు అమృతలూరు – పెదపూడి గ్రామాల మధ్యలో ఎత్తివేసిన వైన్‌ షాపు దుకాణం వద్ద బాలిక మృతదేహం, షాపు ముందు సతీష్‌ మృతదేహాలను గుర్తించారు. వెంటనే గ్రామమంతటా తెలియడంతో అందరూ ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు రంగప్రవేశం చేశారు.

ఒంటిపై గాయాలు..
మృతుడు సతీష్‌ వద్ద ఒక బ్లేడు, కొంత నగదు, సెల్‌ఫోన్‌ ఉన్నాయి. అతని చేతిపై బ్లేడుతో కోసిన గాట్లు ఉన్నాయి. బలవంతంగా అతనిని కట్టివేసి ఏదైనా కూల్‌డ్రింక్‌లో సైనేడ్‌ కలిపి తాగించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరినైనా గుర్తు పడుతుందేమోనని ముక్కుపచ్చలారని బాలికను కర్కశంగా చంపివేసి ఉంటారని భావిస్తున్నారు. మృతులిద్దరి మెడలపై నల్లటి ఆయిల్‌ పూసి ఉంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పలువురు ఇది హత్యేనని చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో, పోలీసుల విచారణలో వాస్తవాలు వెల్లడి కావాల్సి ఉంది. ఘటనా స్థలికి గుంటూరు నుంచి వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌ బృందం వచ్చి ఘటనా స్థలిలో ఉన్న ఆధారాలను సేకరించారు.

ఆధారాల సేకరణ
ఘటనా స్థలికి తెనాలి డీఎస్పీ ఎం.స్నేహిత, తెనాలి వన్‌టౌన్‌ సీఐ బెల్లం శ్రీనివాసరావు, చుండూరు ఇన్‌చార్జి సీఐ బత్తుల కల్యాణరాజు, అమృతలూరు, చుండూరు ఎస్సైలు ఆర్‌ఎస్‌. శ్రీనివాస్, కె.విక్టర్‌లు, ఇన్‌చార్జి ఆర్‌ఐ ఎంవీఆర్‌ బ్రహ్మం సందర్శించి ఆధారాలను సేకరించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దహన సంస్కారాలు, చేశారు. బాలికను పూడ్చి పెట్టారు. మృతుని సోదరుడు సురేష్‌బాబు ఫిర్యాదు మేరకు అమృతలూరు ఎస్‌ఐ ఆర్‌ఎస్‌ శ్రీనివాస్‌ కేసు నమోదు చేశారు. చుండూరు ఇన్‌చార్జి సీఐ బత్తుల కల్యాణరాజు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు