ఏసీబీకి చిక్కిన వీఆర్వో !

24 Jan, 2019 09:19 IST|Sakshi
ఏసీబీ అధికారి అదుపులో ఉన్న వీఆర్వో కృష్ణదాసు

మ్యూటేషన్‌ కోసం రూ. 15 వేలు డిమాండ్‌

రూ. 10 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన జింకిభద్ర వీఆర్వో కృష్ణదాసు

బాధితుడి ఫిర్యాదుతో వలవేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు

శ్రీకాకుళం, సోంపేట: తండ్రి నుంచి వచ్చే వారసత్వ ఆస్తిని తన పేరున మార్చేందుకు కావాల్సిన మ్యూటేషన్‌ కోసం ఆ వ్యక్తి వీఆర్వోను సంప్రదించాడు. అయితే  15 వేల రూపాయలు లంచం ఇస్తేనే మ్యూటేషన్‌ ఇస్తానని గ్రామ రెవెన్యూ అధికారి షరతు విధించాడు. దీంతో చేసేది లేక పది వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించాడు. తరువాత విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారిచ్చిన సలహా మేరకు డబ్బులు ఇస్తుండగా దాడి చేసి వీఆర్వోను అవినీతి నిరోధకశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన సోంపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం చోటుచేసుకుంది. తూముల వినోద్‌ కృష్ణ అనే వ్యక్తి నుంచి రూ. 10 వేలు తీసుకుంటుండగా జింకిభద్ర వీఆర్వో (బారువ ఇన్‌చార్జి) గుంట కృష్ణదాసును పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సోంపేటపట్టణానికి చెందిన తూముల వినోద్‌కృష్ణకు తండ్రి లక్ష్మీనారాయణ పాత్రో నుంచి వారసత్వంగా బారువ రెవెన్యూ గ్రామంలో  3.04 ఎకరాల ఆస్తి సంక్రమించింది. దీన్ని తన పేరున మార్చుకోవడానికి వినోద్‌కృష్ణ ఏడాదిగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.

మ్యూటేషన్‌  కోసం ఈ ఏడాది  5వ తేదీన మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. తన తండ్రి పేరు మీద ఉన్న ఆస్తి తన పేరున మార్పు చేయాలని బారువ ఇన్‌చార్జి  గ్రామ రెవెన్యూ అధికారి  కృష్ణదాసును వినోద్‌ కృష్ణ కలిశాడు. అయితే 15 వేల రూపాయలను ఇవ్వాలని వీఆర్వో డిమాండ్‌ చేశారు. కేవలం మ్యూటేషన్‌ కోసం ఇంత మొత్తం  అడగడంతో చేసేది లేక ఏసీబీ అధికారులను ఆయన  ఆశ్రయించి తన గోడు చెప్పుకున్నాడు. దీంతో వీఆర్వోను పట్టుకోవడానికి పథకం  వేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోని సర్వేయర్‌ కార్యాలయంలో ఉన్న వీఆర్వో కృష్ణదాస్‌ను వినోదకృష్ణ కలిశాడు. మ్యూటేషన్‌ కోసం పది వేల రూపాయలు ఇస్తున్నానని చెప్పాడు. ఆ నగదును వినోదకృష్ణ నుంచి వీఆర్వో కృష్ణదాసు తీసుకుంటుండగా అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు దాడి చేసి కృష్ణదాసునుఅదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఏసీబీ సీఐ  శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ రెవెన్యూ అధికారిని అదుపులోకి తీసుకొని శ్రీకాకుళం తరలించి విచారణ చేస్తామని ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర తెలిపారు.

 కావాలనే ఇరికించారు
మూడు నెలల క్రితం బారువ గ్రామానికి ఇన్‌చార్జి రెవెన్యూ అధికారిగా చార్జి తీసుకున్నాను. వినోద్‌ కృష్ణ ఈ నెల 5వ తేదీన మ్యూటేషన్‌ కోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు స్వీకరణకు మార్చి 5వ తారీఖు వరకు గడువు ఉంది. సర్వేయర్‌ కార్యాలయంలో ఉన్న నన్ను బయటకు పిలిచి జేబులో కవరు పెట్టాడు. ఏమి జరిగిందో తెలుసుకునే లోపే అధికారులు నన్ను అదుపులోకి తీసుకున్నారు. కావాలనే నన్ను ఎవరో ఇరికించారు.కృష్ణదాసు, గ్రామ రెవెన్యూ అధికారి

మరిన్ని వార్తలు