కట్టుకున్నవాడే కడతేర్చాడు

24 Jul, 2019 09:03 IST|Sakshi
వాసుపల్లి లక్ష్మి మృతదేహం   

పాతనగరంలో అర్ధరాత్రి హత్య

నిందితుడు పారిపోతుంటే పట్టుకున్న స్థానికులు 

సాక్షి, పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): కాయకష్టంతో నడుస్తున్న కుటుంబంలో రుణం చిచ్చులా మారి చివరకు భార్య హత్యకు దారితీసింది. ఈ ఘటనతో పాతనగరంలోని గొల్లవీధి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భార్య తనకు తగిన ప్రాధాన్యమివ్వడం లేదని, కూతురు వివాహానికి చేసిన అప్పు తీర్చడంలో సాయం చేయడం లేదన్న ఆగ్రహంతో భార్య మెడకు తువ్వాలు వేసి నులిమి హత్య చేసిన సంఘటన జీవీఎంసీ 23వ వార్డు గొల్లవీధిలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటుచేసుకుంది. ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వాసుపల్లి గండోడు (48)తో జాలారిపేటకు చెందిన లక్ష్మి(43)కి 26 ఏళ్ల కిందట వివాహమయింది. వీరికి పార్వతి అనే అమ్మాయి ఉంది. అయితే కాలక్రమంలో భార్యభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. అనంతరం గండోడు రెండు పెళ్లిళ్లు చేసుకోగా... అతడి ప్రవర్తన నచ్చక ఇద్దరు భార్యలూ విడిపోయారు. 

అప్పు తీర్చేందుకు సహకరించలేదని...
ఈ నేపథ్యంలో ఆరేళ్ల క్రితం గండోడు, అతడి మొదటి భార్య లక్ష్మి పెళ్లీడుకు వచ్చిన తమ కుమార్తెకు వివాహం చేసేందుకు కలిసి ఉండాలని నిశ్చయించుకున్నారు. అనంతరం సుమారు రూ.2లక్షలు అప్పు చేసి కుమార్తె వివాహం చేశారు. అయితే ఇటీవలి కాలంలో భార్య తనకు ప్రాధాన్యమివ్వడం లేదని, చేసిన అప్పు తీర్చేందుకు సాయం చేయడం లేదని గండోడు కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత భార్యభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భార్య లక్ష్మి మెడకు గండోడు తువ్వాలు వేసి నులిమేశాడు. ఈ పెనుగులాటలో లక్ష్మి వేసిన కేకలు పరిసరాల్లో ఉన్నవారు విన్నారు.

ఈలోగా లక్ష్మిని చంపి గది తలుపులకు తాళం వేసి గండోడు వెళ్లిపోవడం చూసిన ఇరుగుపొరుగు వారు తలుపులు బలవంతంగా తెరవగా లక్ష్మి అచేతనంగా పడి ఉంది. వెంటనే స్థానికులు గండోడుని పట్టుకుని రాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసు అధికారులకు అప్పగించారు. పోలీసుల ఎదుట భార్యను తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. నిందితుడిని ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు