ఎట్టకేలకు మహిళ మృతదేహం వెలికితీత

30 May, 2018 12:07 IST|Sakshi

హత్య గురించి బయటపెట్టిన స్థానికుడు

పోస్ట్‌మార్టం చేసేందుకు నెల్లూరుకు నుంచి డాక్టర్‌ రాక  

అనుమసముద్రంపేట: సంగం మండలంలోని కొరిమెర్ల సమీపంలో ఉన్న పాలడెయిరీ ఆవరణలో పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని మంగళవారం వెలికితీశారు. ఏఎస్‌పేట మండలం శ్రీకొలను గ్రామానికి చెందిన నంది చెంచుకృష్ణారెడ్డి తన ద్వితీయ భార్య పుష్పను పదిరోజుల క్రితం హత్య చేసి డెయిరీ ఆవరణలో పూడ్చిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. అయితే పోస్ట్‌మార్టం వెంటనే చేయకపోవడంతో స్థానికులు రెండుగంటలకు పైగా రహదారిపై ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం సంగం తహసీల్దార్‌ షఫీమాలిక్, పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. కృష్ణారెడ్డి తన భార్య తప్పిపోయిందని ఈనెల 19వ తేదీ నుంచి గ్రామంలో పలువురికి చెప్పాడు. 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు మృతదేహాన్ని ప్లాస్టిక్‌ గోతంలో చుట్టి కొబ్బరిచెట్టు మొదట్లో పూడ్చి పెట్టి ప్రతినిత్యం నీళ్లు పట్టాడు. 

స్థానికుడి చొరవతో వెలుగులోకి..
మూరం శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తితో పుష్ప అదృశ్యమైందని చెంచు కృష్ణారెడ్డి చెప్పాడు. అప్పుడప్పుడు అతనితో ఈ విషయమై మాట్లాడాడు. దీంతో శ్రీనివాసులురెడ్డికి అనుమానం కలిగింది. రెండురోజుల క్రితం అతను విషయాన్ని బయటకు రాబట్టాలని కేరళ మాంత్రికుడు ఒకతను తప్పిపోయిన వ్యక్తుల గురించి చెబుతాడని, ఆయనతో మాట్లాడితే నీ భార్య ఆచూకీ తెలుస్తుందని కృష్ణారెడ్డితో చెప్పాడు. ఈ క్రమంలో కృష్ణారెడ్డి సరే అనడంతో మాంత్రికుడితో మాట్లాడినట్లుగా శ్రీనివాసులురెడ్డి నటించాడు. నీ భార్య మృతిచెందిందని మాంత్రికుడు చెబుతున్నాడని చెప్పగానే కృష్ణారెడ్డి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అరగంట తర్వాత వచ్చి మాంత్రికుడికి చనిపోయిన వ్యక్తులను ఎక్కడ పూడ్చింది తెలుస్తుందా అని కృష్ణారెడ్డి అడిగాడు. దీంతో శ్రీనివాసులురెడ్డి మరోమారు మాంత్రికుడితో మాట్లాడుతున్నట్లుగా నటించి అతను గ్రామానికి వస్తున్నాడని చెప్పడంతో కృష్ణారెడ్డి అసలు విషయం బయటపెట్టేశాడు. పుష్పను తానే చంపానని, మృతదేహాన్ని నెల్లూరు పెన్నానదిలో పడవేశానని, ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని ప్రాధేయపడ్డాడు.

ఈ విషయాన్ని పూర్తిగా నమ్మని శ్రీనివాసులురెడ్డి మాంత్రికుడి ఆదేశాల మేరకు చనిపోయిన మహిళ దెయ్యమై పట్టుకుంటుందని, దీనికి విరుగుడిగా మృతదేహం పూడ్చినచోట నిమ్మకాయలు పెట్టి కర్పూరం వెలిగిస్తే ఆ ప్రమాదం తప్పుతుందని నిందితుడితో చెప్పాడు. దీంతో అతను శ్రీనివాసులురెడ్డిని వెంట తీసుకెళ్లి తోట బయట అతడిని పెట్టి కర్పూరం వెలిగించేందుకు లోపలకు వెళ్లాడు. ఈలోగా శ్రీనివాసులురెడ్డిని గ్రామస్తులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందజేయడంతో ఒక్కసారిగా అందరూ ఘటనా స్థలానికి చేరుకుని వెళ్లే క్రమంలో నిందితుడు ఎదురుపడగా గ్రామస్తులు అతడికి దేహశుద్ధి చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం గ్రామస్తులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అయితే డాక్టర్లు అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు. అయితే గ్రామస్తులు ఆందోళన చేస్తుం డటంతో సాయంత్రం నెల్లూరు నుంచి మహిళా డాక్టర్‌ను పిలిపించి సంగం తహసీల్దార్‌ షఫీమాలిక్‌ పర్యవేక్షణలో పోస్ట్‌మార్టం చేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ సమయంలో గొడవలు జరగకుండా ఆత్మకూరు ఎస్సై నరేష్‌యాదవ్, సంగం ఎస్సై నాగార్జున, బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై ప్రసాద్‌రెడ్డి, ఏఎస్‌పేట ఏఎస్సై వెంకటసాయిలు బందోబస్తు నిర్వహించారు. 

గ్రామంలో విషాదం  
శ్రీకొలను గ్రామానికి చెందిన పుష్ప భర్త, బంధువుల చేతిలో కిరాతకంగా చంపబడి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పుష్ప కుమారుడు చంద్రశేఖర్‌ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. 

మరిన్ని వార్తలు