అమ్మను కాపాడుకోలేమా?

31 Jul, 2019 07:56 IST|Sakshi
జ్యోతి మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

మాతృత్వం ఓ కమ్మని కల. తొమ్మిది నెలలు మోసి.. ప్రసవించాక.. అందివచ్చే ఆ తీయని అనుభూతే వేరు. కానీ చాలామంది గిరిజన ప్రాంత గర్భిణులకు మాత్రం అది దైవాధీనమే. 280 రోజులపాటు కడుపులో ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్న బిడ్డ దక్కకపోతే ఆ తల్లి బాధ వర్ణనాతీతం. బిడ్డతోపాటు తల్లి సైతం కన్నుమూస్తే ఆ ఇంట నిండేది గాఢాంధకారం. అలాంటి విషాద సంఘటన ఈ వారంలో రెండోసారి జరిగింది. మూడు ఆస్పత్రులకు తిప్పినా ఘోరం ఆగలేదు. ఆమె ప్రాణం నిలబడలేదు. అమ్మను కాపాడుకోలేమా? ఈ ప్రశ్నకు బదులేది?

సాక్షి, భామిని(శ్రీకాకుళం) : మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కోసింగిగూడ కాలనీకి చెందిన గిరిజన మహిళ బిడ్డిక జ్యోతి (22) పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ప్రసవానంతరం సోమవారం అర్ధరాత్రి ప్రాణాలు విడిచింది. మూడు ఆస్పత్రులకు తిప్పినా ప్రయోజనం లేకపోయింది. మాతాశిశు మరణాలను అరికట్టడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ  మరణాలు ఆగడం లేదు. ఈ మధ్యకాలంలో సీతంపేట ఏజెన్సీలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, తాజాగా భామిని మండలంలో ఇలాంటి ఘటనే జరగడం ఆందోళనకు గురి చేస్తోంది. బిడ్డిక జ్యోతికి ఉదయం పురిటి నొప్పులు రావడంతో కోసింగూడ కాలనీ నుంచి భామిని పీహెచ్‌సీకి ఆశ వర్కర్‌ ప్రశాంతి సాయంతో తరలించారు.

అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు కొత్తూరు కమ్యూనిటీ ఆస్పత్రికి రిఫర్‌ చేసి 108 అంబులెన్స్‌లో జ్యోతిని పంపించారు. అనంతరం కొత్తూరు నుంచి పాలకొండ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ ప్రసవం జరిగిన తరువాత జ్యోతి మృత్యు ఒడిలోకి చేరిందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. మృత శిశువు పుట్టింది.. అంతలోనే తల్లి ప్రాణాలు విడవడంతో కుటుంబ సభ్యుల కన్నీటికి అంతం లేదు.  వైద్యం కోసం మూడు ఆస్పత్రులు తిరిగినా ప్రాణాలు దక్కలేదని వాపోతున్నారు. విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం వనబారింగికి చెందిన జ్యోతి, కోసంగూడ కాలనీకి చెం దిన దేవరాజు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నా రు. వీరు ఎంతో అన్యోన్యంగా జీవనం సాగించేవారని చుట్టుపక్కల వారు అంటున్నారు. జ్యోతి మరణంతో కుటుంబ సభ్యులు శోకంలో మునిగిపోయారు. 

మరిన్ని వార్తలు