ఆశలు చిదిమేసిన లారీ

2 Sep, 2019 08:06 IST|Sakshi

సచివాలయ ఉద్యోగానికి పరీక్ష రాసేందుకు వెళ్లిన వివాహిత

తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొనడంతో దుర్మరణం

జాతీయ రహదారిపై మధురవాడ సమీపంలో దుర్ఘటన 

సాక్షి, పీఎం పాలెం (భీమిలి): ఆ వివాహిత ఉన్నత విద్యావంతురాలు.. మంచి ఉద్యోగం సాధించి భర్తకు అండగా నిలవాలనుకుంది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సచివాలయ ఉద్యోగానికి పరీక్ష రాసేందుకు భర్తతో కలిసి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో లారీ రూపంలో మృత్యువు కాటేయడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలవడంతో ఆమె ఇద్దరు బిడ్డలు తల్లిలేని వారయ్యారు. ఈ హృదయవిదారకర దుర్ఘటన జాతీయ రహదారిపై మధురవాడ బస్టాప్‌ సమీపంలో చోటుచేసుకుంది. పీఎం పాలెం సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... గోపాలపట్నం బాజీ జంక్షన్‌ ప్రాంతానికి చెందిన బెహరా(ఒప్పంగి) దివ్య మాధురి (27) బీఎస్సీ, బీఈడీ వరకూ చదువుకుంది. ఆమెకు 5 సంవత్సరాల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు.

సచివాలయ ఉద్యోగానికి పరీక్ష రాయడానికి పీఎం పాలెం సమీప సాంకేతిక విద్యాపరీషత్‌ పరీక్షా కేంద్రానికి భర్తతో కలిసి ఆదివారం ఉదయం బైక్‌పై వచ్చింది. పరీక్ష అనంతరం తగరపువలసలో ఉంటున్న ఆడపడుచు ఇంటికి వెళ్లడానికి భార్యాభర్తలు బయలుదేరారు. జాతీయ రహదారిపై బ్రిడ్జి దాటిన తరువాత చంద్రంపాలెం ప్రభుత్వ హైస్కూలు ఎదురుగా ట్రాఫిక్‌ అధికంగా ఉండటంతో తమ వాహనాన్ని ఓ పక్కగా నిలిపారు. అదే సమయంలో ఓ లారీ ముందు వెళ్తున్న కారుని ఢీకొట్టింది.

అదే వేగంతో కారు పక్కనున్న ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టడంతో ఒక్కసారిగా దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. తీవ్రంగా గాయపడిన దివ్యమాధురి సంఘటన స్థలంలో మృతి చెందగా భర్త వెంకట దుర్గాప్రసాద్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. రోడ్డు ప్రమాదం రూపంలో దివ్యమాధురిని విధి కాటేయడంతో పిల్లలిద్దరూ తల్లి లేనివారయ్యారు. ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం పలువురిని కంటతడి పెట్టించింది. పాత గోపాలపట్నంలో ఆరేళ్లుగా నివాసముంటున్నారు. ఇక్కడ అందరితో కలివిడిగా ఉండే మాధురి మృతితో ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది. భర్త దుర్గాప్రసాద్‌ లారెన్స్‌ అండ్‌ మయో కళ్లద్దాల సంస్థలో పని చేస్తున్నారు. పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు