పేదోడి గుండెల్లో పెద్దాయన

2 Sep, 2019 08:06 IST|Sakshi
యలమంద గుండెల్లో వైఎస్‌ ధ్యానంలో ఉన్న ఫొటో

మూడుసార్లు ఇడుపులపాయ వైఎస్‌ సమాధిని దర్శించుకున్నా

సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఒక్కసారి అయినా నేరుగా కలుసుకోవడమే ఆశయం

ఆరోగ్యశ్రీతో ఆరోగ్యవంతుడైన పాలపర్తి యలమంద

సాక్షి, ఒంగోలు: పాలన అంటే ఏదో ఒక చేతితో ఇచ్చి మరో చేతితో తీసుకోవడం కాదయ్యా...ప్రజల కష్ట సుఖాలు కళ్లతో చూస్తూ హృదయంతో పాలించడం అని స్థానిక ప్రకాశం కాలనీ వాసి పాలపర్తి యలమంద పేర్కొంటున్నారు. అలాంటి నేతను నా జీవితంలో వైఎస్సార్‌ను చూశా. పాత మార్కెట్‌ సెంటర్‌లో ఒక చిన్న బంకు పెట్టుకొని చెప్పులు కుట్టుకుని కుటుంబం పోషించడం మాత్రమే నాకు తెలిసిన విద్య. నాకు ముగ్గురు సంతానం అయితే ఒకరు నా కళ్లముందే కన్నుమూశారు. మిగిలిన ఇద్దరు బిడ్డలను చదివించుకోవాలన్నా, కుటుంబాన్ని పోషించుకోవాలన్నా, ఏదైనా జబ్బు చేస్తే ఆదుకోవాలన్నా కొత్త చెప్పులు కుట్టి విక్రయించడం లేదా పాత చెప్పులు తెగితే కుట్టడం మాత్రమే నాకు తెలిసింది. ఈ దశలో 2008 జూలైలో నాకు ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. ఆరోగ్య శ్రీ కార్డు ఉండడంతో హుటాహుటిన గుంటూరు లలితా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. నాతో పాటు నా భార్య ఉంది.

అక్కడకు చేరిన తరువాత నా జేబులో ఉన్నది రూ. 50లు మాత్రమే. నాకు ఆపరేషన్‌ ఉచితంగా చేసినా నా భార్య తిండికి ఎలా ఇబ్బంది పడుతుందా అని అనుకున్నా. కానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత ఇంటికి వచ్చిన తరువాత చూస్తే నా జేబులో రూ. 50లు నా జేబులోనే ఉన్నాయి. ఎందుకంటే నేను ఆపరేషన్‌ చేసినందువల్ల నేను చొక్కా తొడగలేదు. ఇంటికి వచ్చిన తరువాత చూసి నా భార్యను ఇదేమని అడిగితే అన్నం వారే పెట్టారు, మందులు ఇచ్చారు, ఇంటికి వచ్చేటపుడు ఛార్జీలు కూడా వారే ఇచ్చారు అందువల్ల నాకు రూపాయి కూడా ఖర్చు కాలేదని చెప్పింది. అంతే కాదు...12 సంవత్సరాల పాపకు గుండె జబ్బు.. మూడు సంవత్సరాలుగా ఆసుపత్రికి వచ్చి చూపించుకుంటుందట. నాతోపాటు ఆ పాపకు కూడా వైద్యం చేశారు ఉచితంగా. అందుకే వైఎస్సార్‌ అంటే మా ఆరాధ్య దైవం. అందుకే మా గుండెల్లో ఆయనను నిలుపుకున్నాం.

అపురూపం ఆ పటం...అది ఉందనే షాపును తొలగించేశారు
ఆసుపత్రి నుంచి వచ్చి తిరిగి షాపులో పని మొదలుపెట్టిన తరువాత నా అభిమానంతో నేను సొంతంగా ఒక బొమ్మ తయారు చేయించా. వైఎస్‌ గుండెల్లో నేను ఉన్నానని. అయితే ఒక టీడీపీ కార్యకర్త అది చూశారు. వైఎస్‌ గుండెల్లో నువ్వు ఉండడం కాదని, నీ గుండెల్లో వైయస్‌ ఉండేలా మంచిదంటూ ఆయనే చిత్రపటం చేయించి నాకు అందించారు. ఆ చిత్రపటం షాపులో పెట్టుకొని ఉంటే మూడు సంవత్సరాల నాడు వైఎస్సార్‌సీపీ అంటూ దారుణంగా నాకు ఉన్న షాపును తొలగించేశారు. అక్కడ ఎలక్ట్రానిక్‌తో కూడిన టాయిలెట్‌ ఒకటి నిర్మించి మారు మాట్లాడకుండా చేశారు. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం సమీపంలో మరలా బంకు పెట్టుకుని చెప్పులు కుట్టుకుంటున్నా. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ వచ్చినా చిత్రపటం షాపులో ఉంచితే మరలా ఎక్కడ షాపును తొలగిస్తారో అనే భయంతో ఇప్పటికీ ఇంట్లోనే ఉంచుకున్నా. మరోమారు పొట్ట మీద కొడితే ఓర్చుకునే శక్తి నాకు లేదు.

ఇంటికి దక్కింది పాతిక సిమెంట్‌ కట్టలే
నా కొడుకు 2017–18లో పీఎంఏవై– ఎన్టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ స్కీం కింద నా కొడుకు ఇళ్లు కట్టుకున్నాడు. రూ. 3.50లక్షలు రాయితీ వస్తుందన్నారు. కానీ ఇప్పటి వరకు వచ్చింది కేవలం పాతిక సిమెంట్‌ కట్టలు మాత్రమే. రెండేళ్లు పూర్తిగా ముగిసే వరకు కూడా డబ్బులు ఇవ్వాలని అనిపించలేదు. మాట మీద నిలబడని నాయకులే 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తే మాట మీద నిలబడి ఇచ్చిన హామీలన్నింటిని తొలి ఏడాదిలోనే అమలు చేసేందుకు కృషి చేస్తున్న జగన్‌ ఇంకేన్నేళ్లు ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తాడో అర్థం చేసుకోవచ్చు. వలంటీర్ల వ్యవస్థ కూడా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు పెట్టలేదు. కేవలం హృదయంతో పాలించే వ్యక్తి కాబట్టే ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం కావాలని పెట్టారు. అందుకే వైఎస్‌ అన్నా, వారి కుటుంబం అన్నా...జగన్‌మోహన్‌ రెడ్డి అన్నా జీవితాంతం రుణపడి ఉంటాం. కాకుంటే నా జీవిత ధ్యేయం జగన్‌మోహన్‌ రెడ్డి గారికి నా చేతులతో ఒక జత మంచి చెప్పులు కుట్టియ్యాలని, జగన్‌మోహన్‌ రెడ్డిగారిని ఒక్కసారైనా నేరుగా కలుసుకోవాలని.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా