బ్రేక్‌ వేయబోయి వృద్ధుడిని బలిగొని..

24 May, 2018 14:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : డ్రైవింగ్‌ నేర్చుకుంటున్న యువతి బ్రేక్‌ వేయబోయి ఎక్సలేటర్‌ నొక్కడంతో ఎదురుగా వస్తున్న వృద్ధుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ మహిళకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా లేదని పోలీసులు పేర్కొన్నారు. కీర్తి వల్లభ్‌ అనే 72 సంవత్సరాల వృద్ధుడు వాకింగ్‌ చేస్తుండగా సంతోషి దేవి (29) అనే మహిళ డ్రైవింగ్‌ చేస్తూ కారు అదుపుతప్పడంతో వృద్థుడిపైకి దూసుకెళ్లింది. వల్లభ్‌ చేతులు పైకెత్తి ఆమెను వారించినా తొందరపాటులో బ్రేక్‌ వేయబోయి ఎక్సలేటర్‌ను ప్రెస్‌ చేయడంతో వాహనం ఆయనను ఢీ కొంది. ఈ ఘటనలో వల్లభ్‌ మరణించగా సంతోషిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తూ మరణానికి కారణమయ్యారనే ఆరోపణలు నమోదు చేశారు. కారు ఆమె భర్తది కావడంతో ఆయనపైనా పోలీసులు చర్యలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

బ్రేక్‌ వేయబోయిన తాను భయంతో ఎక్సలేటర్‌ను ప్రెస్‌ చేసినట్టు విచారణలో సంతోషి దేవి పోలీసులకు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో వల్లభ్‌ కుమార్తె ఇంట్లో లేరని, పోలీసులకు ఎవరూ సమాచారం అందించలేదని సమాచారం. ఇరుగుపొరుగు వారు తనకు ఫోన్‌ ద్వారా సమాచారం అందచేయడంతో భర్తతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నామని వల్లభ్‌ కుమార్తె చెప్పారు.ప్రమాదంలో గాయపడిన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారని చెప్పారు. ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించడంతో సంతోషి దేవిని పోలీసులు ఆమె నివాసంలో అరెస్ట్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు