పరువు తీసిందనే..

6 Dec, 2018 09:12 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న కుల్సుంపురా సీఐ శంకర్‌

మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ నిందితుల అరెస్ట్‌

జియాగూడ:జాతీయ రహదారిపై ఓ మహిళను దారుణంగా హత్యచేసిన కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు కుల్సుంపురా ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం వివరాలు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిలో అర్ధరాత్రి  ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అదే సమయంలో బెంగళూర్‌ నుండి శ్రీకాకుళం వెళ్తున్న జియాగూడకు చెందిన లారీ డ్రైవర్‌ దిగంబర్‌ సమీపంలోనే లారీని నిలిపి శుభ్రం చేస్తుండగా కేకలు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను హత్య చేస్తున్నట్లు గుర్తించాడు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వారు ఎదురుదాడికి దిగారు. అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీడ్రైవర్‌ ఇచ్చిన సమాచారంతో పాటు బైక్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని టప్పాచబుత్ర ప్రాంతానికి చెందిన జాహెదాబేగంగా గుర్తించారు.

టప్పాచబుత్ర నట్రాజ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ హుస్సేన్‌పాషా కాపర్‌ పాలీష్‌వర్క్‌ చేసేవాడు. జాహెదాబేగం కూడా అదే పని చేస్తుండటమేగాక డబ్బులను వడ్డీకి ఇచ్చేది. కొద్ది రోజుల క్రితం మహ్మద్‌ హుస్సేన్‌ పాషా ఆమె వద్ద రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. గత మూడు నెలలుగా అసలు, వడ్డీ చెల్లించక పోవడంతో జాహెదాబేగం బేగంబజార్‌లో అతను పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి గొడవ పడింది. దీనిని మనసులో పెట్టుకున్న హుస్సేన్‌పాషా తన పరువు తీసినందున ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఫలక్‌నూమా  ఫాతీమానగర్‌కు చెందిన తన స్నేహితుడు సయ్యద్‌ అబీద్‌అలీతో కలిసి పథకం పన్నాడు. ఇద్దరూ కలిసి జహెదాను జాతీయ రహదారిపైకి తీసుకువెళ్లి కత్తితో పొడిచి హత్య చేశారు. బుధవారం  అఫ్జల్‌గంజ్‌ ప్రాంతం లో అనుమానాస్పదంగా కనిపించిన మహ్మద్‌ హుస్సేన్‌పాషాను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిచ్చిన వివరాల ఆధారంగా ఆబీద్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు