పదేళ్లు సహజీవనం.. చివరకు రూ.50 వేల కోసం

23 Nov, 2019 16:49 IST|Sakshi

సాక్షి, విజయవాడ : జగ్గయ్యపేటలో శనివారం జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. పదేళ్లు సహజీవనం చేసిన ఓ మహిళ తన ప్రియుణ్ని దారుణంగా హత్య చేసింది. హత్యకు సహకరించిన తన కొడుకు, కూతురు, అల్లుడిని కేసు నుంచి తప్పించేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయింది. చివరకు అడ్డంగా దొరికిపోవడంతో.. ఇంట్లో వంట చేసినంత సులువుగా.. ఎలా హత్య చేసింది పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది.

వివరాలు.. కర్ణాటకకు చెందిన విజయకుమార్ బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం కృష్ణా జిల్లాకు వచ్చాడు. జగ్గయ్యపేట ధనంబోర్డులో మకాం పెట్టాడు. అదే ప్రాంతానికి చెందిన వివాహిత రాధపై మనసు పారేసుకున్నాడు. మొదటి భర్తకు దూరమై ఇద్దరు బిడ్డలతో కష్టాలు పడుతున్న రాధ విజయ్‌తో సహజీవనం చేయసాగింది. అతని సహకారంతో పిల్లల్ని పెద్దచేసింది. ఈక్రమంలో ఆమె కొడుకు ఇంటర్‌ పూర్తి చేసి ఓ మెకానిక్ షాప్‌లో పనిచేస్తుండగా.. కూతురికి వివాహమైంది. విజయ్ సంపాదనతో రాధ ఓ ఇల్లు కూడా కొనుగోలు చేసింది.

అయితే, కొద్ది రోజుల క్రితం రాధ కూతురు, అల్లుడు విజయ్ వద్ద రూ.50 వేలు అప్పు తీసుకొన్నారు. వారు డబ్బు తిరిగి చెల్లించకపోవటంతో ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో శనివారం కూడా మరోమారు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో రాధ విజయ్‌ని గడ్డపలుగుతో కొట్టి దారుణంగా హత్య చేసింది. తన కూతురు, కొడుకు, అల్లుడిని కేసు నుంచి తప్పించడానికి మృతదేహంపై ఎక్కడా రక్తపు మరకలు, వేలిముద్రలు చిక్కకుండా ఇల్లంతా కడిగేసింది. చివరకు పోలీసుల విచారణలో రాధ నేరాన్ని అంగీకరింది. కూతురు, అల్లుడుపై విజయ్‌ దాడి చేస్తుంటే.. వాళ్ళని రక్షించేందుకు గడ్డపారతో కొట్టి చంపేశానని వెల్లడించింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు