మహిళా జర్నలిస్టుపై దాడి...కాల్పులు

23 Jun, 2019 10:25 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. నోయిడాకు చెందిన మహిళా జర్నలిస్టుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగుల దాడిలో గాయపడిన ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వివరాలు.. మిథాలి చందోలా వృత్తిరీత్యా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా ఆమె శనివారం అర్ధరాత్రి తన కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు ఆమె కారును అడ్డగించి కాల్పులకు తెగబడ్డారు. ముఖానికి మాస్కులు ధరించి కారు ముందు భాగంలో బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతరం కోడిగుడ్లతో దాడి చేశారు.

ఈ ఘటనలో మిథాలీ చేతిలోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. మిథాలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని, వ్యక్తిగత కక్షతోనే దుండగులు దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో మిథాలిపై దాడి జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా 2008లో కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సౌమ్య విశ్వనాథన్‌ అనే మహిళా జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

మరిన్ని వార్తలు