ఒడిశా బాలికపై ఇద్దరు అత్యాచారం

9 Jan, 2019 11:33 IST|Sakshi
ఒడిశా కూలీల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

బోడకొండ ఇట్టుక బట్టీలో దారుణం

మంచాల: పొట్టకూటి కోసం ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వచ్చిన ఒడిశా బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మంచాల మండల పరిధిలోని బోడకొండ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బోడకొండలో కొన్నేళ్లుగా ఒడిశా రాష్ట్రంలోని బాలంగీర్‌ జిల్లా తురేకాన్‌ మండలం శ్యామల గ్రామానికి చెందిన పలువురు కూలీలు పని చేస్తున్నారు. అయితే, గ్రామానికి చెందిన యువకులు శ్రీను, మహేందర్‌ కూడా బట్టీలో పని చేస్తున్నారు. సోమవారం రాత్రి ఒడిశా రాష్ట్రానికి చెందిన బాలిక(15)పై వీరు అత్యాచారానికి పాల్పడ్డారు.

రాత్రి చీకటి సమయం కావడంతో కూలీలు భయపడి మిన్నకుండిపోయారు. మంగళవారం ఉదయం జరిగిన సంఘటనపై కూలీలు బట్టీ యాజమాన్యంతో గొడవపడ్డారు. తాము ఇక్కడ ఉండమని, రక్షణ లేదని వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. దీంతో వారు కూలీలకు సర్ది చెప్పి కొంత డబ్బు ఇస్తామని ఆశచూపారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వివరాలను సేకరించి నిందితులపై కేసు నమోదు చేశారు. బాధితురాలైన బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు