చిన్నారికి పెద్ద కష్టం

18 Sep, 2017 12:51 IST|Sakshi
బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న బంటు సాయి, పక్కన తల్లి మంగమ్మ

పదోతరగతి చదువుతుండగా బ్లడ్‌ క్యాన్సర్‌
వైద్యం కోసం సహకరించని ఆర్థిక పరిస్థితి
తల్లడిల్లుతున్న నిరుపేద కుటుంబం
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు..


సాలూరురూరల్‌ (పాచిపెంట) :
మండలంలోని కేసలి పంచాయతి పరిధి మడవలస గ్రామానికి చెందిన బంటు జోగయ్య, మంగమ్మలది నిరుపేద గిరిజన కుటుంబం. నిర్వాసితులు. సెంటు భూమి లేదు. ప్రభుత్వం కట్టించి ఇచ్చే గూడులో కాలం వెళ్లదీస్తున్నారు. ఆలుమగలిద్దరూ కూలిపనులు చేస్తూ ఇద్దరు పిల్లలను సాకారు. పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. చిన్న కుమార్తె సాయిను పాచిపెంట కేజీబీవీలో చేర్పించారు. కుమార్తె చక్కగా చదువుకుంటుంటే సంబర పడ్డారు. తమ కష్టానికి ఫలితం దక్కుతుందని, ఉద్యోగం సాధిస్తుందని ఆశపడ్డారు. బాలిక పదోతరగతి చదువుతుండగా బ్లడ్‌ క్యాన్సర్‌ సోకింది. చిన్నారి ఆరోగ్యాన్ని ఛిదిమేసింది.

ఆస్పత్రుల పాలచేసి చదువుకు దూరం చేసింది. చిన్నారి ఆరోగ్యాన్ని బాగుచేయించేందుకు ఉన్నకాడికి అప్పులు చేశారు. రూ.3 లక్షలు వ్యయం చేశారు. ఇప్పుడు నెలకు మందుల ఖర్చుకోసం రూ.2500 ఖర్చవుతోంది. ఆస్పత్రులకు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్థిక స్థోమత సహకరించడం లేదు. చేపలవేటతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న జోగయ్య,మంగమ్మలు కుమార్తె ఆరోగ్య పరిస్థితిని చూసి తల్లడిల్లుతున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు దయతలచి చదువుల తల్లిని కాపాడాలంటూ ప్రాథేయపడుతున్నారు.

మరిన్ని వార్తలు