మావోల అదుపులో 12 మంది పాస్టర్లు?

8 Nov, 2015 08:21 IST|Sakshi

భద్రాచలం: తెలంగాణ-ఆంధ్ర-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో వివిధ గ్రామాల్లో చర్చిలను నిర్వహిస్తున్న పన్నెండు మంది పాస్టర్‌లను మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని (విలీన మండలాలు) తూర్పుగోదావరి జిల్లా చింతూరు, ఎటపాక మండలాలకు చెందిన వీరంతా మంగళవారం నుంచి మావోయిస్టుల చెరలోనే ఉన్నట్లు సమాచారం. ఎటపాక, చింతూరు మండలాలకు చెందిన కొంతమంది పాస్టర్లను శనివారం మావోయిస్టులు కిడ్నాప్ చేశారనే ప్రచారం జోరుగా సాగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గత నెల 30న ఎటపాక మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పాస్టర్ కన్నయ్యను కిడ్నాప్ చేసేందుకు వచ్చిన మావోయిస్టులు అతను లేకపోవడంతో అతని కొడుకు ఇసాక్‌ను తీసుకెళ్లిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో చర్చి పాస్టర్‌లు కొంతమంది ఇసాక్ ఆచూకీ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగానే గత మంగళవారం 12 మంది పాస్టర్లు, కొంతమంది సంఘ పెద్దలు ద్విచక్ర వాహనాలపై అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లుగా సమాచారం. ఇలా వెళ్లిన వారికి ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడగా.. పాస్టర్లు ఇసాక్‌ను వదిలేయాలని కోరినట్లు తెలిసింది. అయితే, లక్ష్మీపురం చర్చి పాస్టర్ కన్నయ్యను అప్పగించాలని, అలా అయితేనే,  అతని కుమారున్ని విడిచిపెడతామని మావోలు సూచించినట్లు తెలిసింది.

ఈ క్రమంలో అడవిలోకి వెళ్లిన పాస్టర్లను మావోయిస్టులు తమ అదుపులోనే ఉంచుకొని.. సంఘ పెద్దలను మాత్రమే విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. కన్నయ్యను పంపితే.. ఇసాక్‌తో పాటు మిగిలిన పాస్టర్లను వదిలిపెడతామని మావోయిస్టులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మావోయిస్టులు సరిహద్దుల్లోనే  మకాం వేసి ఉంటారని భావిస్తున్న మూడు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు.      

 పామేడు పోలీస్‌స్టేషన్‌పై మావోల కాల్పులు
 చర్ల: ఖమ్మం జిల్లా చర్ల మండల సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌పై శనివారం ఉదయం మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు తెలిసింది. చర్ల మండల కేంద్రానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలోని పామేడు పోలీస్‌స్టేషన్ పరిసరాలకు సామాన్య ఆదివాసీలుగా వచ్చిన నలుగురు మావోయిస్టులు స్టేషన్ మీదకు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో స్టేషన్‌లో ఉన్న ప్రత్యేక పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు