25న ముద్రగడ పాదయాత్ర

7 Jan, 2017 23:31 IST|Sakshi
  • రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో రేపు కొవ్వొత్తుల ప్రదర్శన
  • కాపు రిజర్వేషన్ల సాధనే లక్ష్యం
  • కోనసీమ టీబీకే కన్వీనర్‌ తాతాజీ
  • మామిడికుదురు : 
    కాపు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దశల వారీ ఆందోళనలో భాగంగా సోమవారం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన జరుగుతుందని కోనసీమ టీబీకే కన్వీనర్‌ కల్వకొలను తాతాజీ తెలిపారు. స్థానిక సినిమా హాల్‌ ఆవరణలో శనివారం జరిగిన కాపు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు నెలాఖరు నాటికి కాపులకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా ముద్రగడకు టీడీపీ నాయకులు హామీ ఇచ్చారని, ఇప్పుడు వారెవ్వరు ఆ హామీపై నోరు మెదపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కాపుల్ని, వారి ఉద్యమాన్ని ఏవిధంగా అణచి వేస్తోందో అందరూ గమనిస్తున్నారని, ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని తాతాజీ హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా ఈ నెల 25వ తేదీన రావులపాలెం నుంచి ముద్రగడ పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. పాదయాత్ర అమలాపురం మీదుగా సాగి 30వ తేదీన అంతర్వేది చేరుకుటుందన్నారు. కాపులను బీసీల జాబితాలో చేర్చేందుకు మద్దతు ఇవ్వాలని ఎస్సీ, బీసీ కులాల నాయకులను కలిసి కోరుతున్నామన్నారు. దానికి వారు సానుకూలంగా స్పందిస్తున్నారని తాతాజీ చెప్పారు. టీబీకే ఆధ్వర్యంలో చేపట్టిన దశల వారీ పోరాటానికి కాపులంతా పార్టీలకతీతంగా తరలిరావాలన్నారు. సమావేశంలో టీబీకే నాయకులు జక్కంపూడి వాసు, అడ్డగళ్ల సాయిరామ్, కొర్లపాటి కోటబాబు, కటకంశెట్టి శ్రీనివాస్, నయనాల వెంకటరత్నం, తులా ఆదినారాయణ, యెరుబండి శివ, నయినాల శివ, పోతు కాశీ, తులా గోపాలకృష్ణ, యెరుబండి చిట్టికాపు, వలవల పెదబాబు, అల్లు బుజ్జి, నయినాల కన్న తదితరులు పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు