కన్వీనరు కోటా.. నిబంధనలకు టాటా

17 Aug, 2016 15:12 IST|Sakshi
డీఎడ్ కళాశాలల యాజమాన్యాల ఫీజుల దందా
కన్వీనర్ కోటాలో సీటొచ్చినా చెల్లించాల్సిందే
కాలేజి యాజమాన్యాల అనధికార వసూళ్లు
చెల్లించకుంటే డీఎడ్ అడ్మిషన్ లేనట్టే..
ముడుపులతో పట్టించుకోని అధికారులు 
 
తిరుపతి: డీఎడ్ కాలేజీల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన రుసుం కంటే ఎక్కువ వసూలు చేస్తున్నా ఉన్నత విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు న ష్టపోతున్నారు. కాలేజీల నుంచి ఏటా ముడుపులు అందుతున్నందువల్లే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనధికారికంగా వసూలు చేస్తున్న ఈ ఫీజులకు కనీసం రశీదు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
 
 
అనధికార ఫీజులతో డీఎడ్ విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. కన్వీనరు కోటాలో సీటొచ్చినా భారీగా చెల్లించకతప్పడం లేదు. జిల్లాలో 70 డీఎడ్ కాలేజీలున్నాయి. వీటిలో ఒకటి మినహా అన్నీ ప్రైవేట్ కళాశాలలే. ఈ కాలేజీల్లో 4,850 మంది విద్యార్థులున్నారు. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 2,250 మంది చేరారు. ఈ కోటాలో సీటొస్తే ప్రభుత్వానికి కౌన్సెలింగ్‌సమయంలో రూ.2500 చెల్లించి ఇష్టమైన కాలేజీలో జాయిన్ కావొచ్చు. కాలేజీలో రిపోర్టు చేసే సమయంలో ఎలాంటి ఫీజు చెల్లించాల్సినవసరం లేదు. అయితే కాలేజీ యాజమాన్యాలు మాత్రం కనీసం రూ.15 నుంచి 20 వేలు లైబ్రరీ, బిల్డింగ్, తదితర ఫీజులు చెల్లిస్తేనే చేర్చుకుంటామని తెగేసి చెబుతున్నాయని తెలిసింది. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు షాకవుతున్నారు.
 
కన్వీనర్  కోటాలో కూడా ఈ దోపిడీ ఏమిటని ఆవేదన వ్యక్తంచేస్తున్నా రు. కోర్సు మధ్యలో చెల్లిస్తామన్నా యాజ మాన్యాలు వినిపించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. ప్రభుత్వమిచ్చే స్కాలర్‌షిప్ రూ.12 వేలు, అనధికారికంగా మరో 20 వేలు వసూలు చేసుకుం టున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా విద్యార్థుల నుంచి అనధికారికంగా రూ.15 నుంచి 20 వేలు వంతున వసూలు చేస్తున్నట్లు భోగట్టా. రూ.5.2 కోట్ల మేర యాజమాన్యాలు ఆర్జిస్తున్నాయి. 
 
కఠిన చర్యలు తప్పవు
అనధికార ఫీజులు వసూలు చేయడానికి నిబంధనలు అనుమతించవు. దీనిపై రెండు, మూడు జిల్లాల నుంచి ఫిర్యాదులొచ్చాయి. కళాశాలలపై చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్, డీఈవో, డైట్ ప్రిన్సిపాల్‌కు ఉంటుంది. ఎవరైనా వారికి ఫిర్యాదు లు చేస్తే ఆ కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. - రాజ్యలక్ష్మి, రాష్ట్ర ఎస్సీఈఆర్టీ (రాష్ట్ర పరిశోధన శిక్షణా కౌన్సిల్) డెరైక్టర్
 
మరిన్ని వార్తలు