ఖరీఫ్‌లో ఆముదం అనుకూల పంట

26 Jun, 2017 22:24 IST|Sakshi
ఖరీఫ్‌లో ఆముదం అనుకూల పంట

- ఏరువాక కోఆర్డినేటర్‌ డాక్టర్‌ డి.సంపత్‌కుమార్‌
అనంతపురం అగ్రికల్చర్‌ : ఖరీఫ్‌లో ఆముదం పంట అనుకూలమని ఏరువాక కేంద్రం (డాట్‌ సెంటర్‌) కోఆర్డినేటర్‌ డాక్టర్‌ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య పేర్కొన్నారు. బెట్ట పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడి ఇస్తుందన్నారు. రైతులు ఈ పంట సాగుపై దృష్టి సారిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు.

పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ :
    వేరుశనగ ఇతర పంటలతో పోల్చుకుంటే ఆముదం పంట సాగుకు పెట్టుబడి తక్కువ. నెలల తరబడి బెట్ట ఏర్పడి ఆలస్యంగా వర్షాలు కురిసినా పంట దిగుబడి వస్తుంది. ఆముదం పంట ఎక్కువగా ఉరవకొండ, కూడేరు, వజ్రకరూరు, గుత్తి తదితర 15 నుంచి 20 మండలాల్లో సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడి వల్ల నికర ఆదాయం పెరుగుతుంది. అడవి పందులు, జింకల బెడద నుంచి కాపాడుకోవచ్చు. మార్కెట్‌లో కూడా మంచి ధరలు ఉండటంతో రైతులకు గిట్టుబాటు అవుతుంది.

ఇవీ.. యాజమాన్య పద్ధతులు :
    చౌడు, నీరు ఇంకే నేలలు మినహా తక్కిన అన్ని రకాల నేలలూ అనుకూలమే. జూన్‌ 15 నుంచి జూలై ఆఖరి వరకు విత్తుకోవచ్చు. కిలో విత్తనానికి 3 గ్రాములు థైరామ్‌ లేదా కాప్టాన పొడి మందుతో కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. వడల తెగలు ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 3 గ్రాములు కార్బండిజమ్‌ లేదా 10 గ్రాములు ట్రైకోడెర్మావిరిడీతో విత్తనశుద్ధి చేసుకోవాలి. సంకరజాతి రకాలు ఎకరాకు 2 నుంచి 2.5 కిలోలు, తేలికపాటి, తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాలకు అధిక దిగుబడిని ఇచ్చే రకాలు ఎకరాకు 4 కిలోలు విత్తుకోవాలి. సాళ్లు, మొక్కల మధ్య 90 - 60 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. క్రాంతి, కిరణ్, జ్యోతి, ప్రగతి లాంటి సూటి రకాల విత్తనాల పంట కాలం 90 నుంచి 150 రోజులు.

ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అదే హైబ్రిడ్‌ రకాలైన పీసీహెచ్‌–111, పీసీహెచ్‌–222 పంట కాలం 90 నుంచి 180 రోజులు. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జీసీహెచ్‌–4 రకం పంట కాలం 90 నుంచి 180 రోజులు. ఎకరాకు 5.50 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. డీసీహెచ్‌–177, డీసీహెచ్‌–519 రకాల పంట కాలం 90 నుంచి 180 రోజులు. ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసి కలియదున్నాలి. ఎకరాకు 30 కిలోలు యూరియా, 100 కిలోలు సూపర్‌ పాస్పేట్, 20 కిలోలు మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులు వేసుకోవాలి.

మరిన్ని వార్తలు