సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేదు

4 May, 2016 15:25 IST|Sakshi
చీమలు కుట్టి చనిపోయిన పసికందు తల్లి లక్ష్మీ

ఉన్నతస్థాయి విచారణపై మీనమేషాలు
న్యాయం జరగదంటున్న బాధిత కుటుంబం
అందుకు కలెక్టర్ ప్రకటనే నిదర్శనం
శిశువు మరణంతోనైనా మారని తీరు

 
విజయవాడ  : ప్రభుత్వాస్పత్రిలో చీమలు కుట్టి పసివాడి ప్రాణం గాల్లో కలిసిపోయినా పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కేవలం సర్కారు నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని పసికందు బంధువులు, విపక్షాలు ఆరోపిస్తూ ఆందోళన చేసినప్పటికీ అధికారులు మొద్దునిద్ర వీడలేదు. విదేశాల్లో ఉన్న వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామంటూ ప్రగల్భాలు పోతూ ప్రకటనలు చేసినా.. ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. లేక లేక పుట్టిన పండంటి బిడ్డ మృత్యువాత పడగా శోకంలో ఉన్న ఆ కుటుంబంపై పాలకులు కనికరం చూపడం లేదు. ఇంతజరిగినా తప్పు కప్పిపుచ్చుకునేందు కు.. విపక్షాలది అనవసర రాద్ధాంతమంటూ ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేయడాన్ని పలువురు ఖండిస్తున్నారు.
 
మాఫీ చేసే ప్రయత్నం
శిశువు మరణంపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం సుముఖత చూపడం లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. విచారణ జరిపితే లోపాలు బయటపడి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న విమర్శలు వస్తాయనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌తో ప్రాథమికంగా విచారణ జరిపి శిశువుకు వైద్యం బాగానే చేశారని, చీమలే లేవని నిర్ధారించినట్లు చెబుతున్నారు.

వాస్తవంగా ప్రభుత్వాస్పత్రిలో ఏదైనా మృతి ఘటన జరిగినప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు వైద్య నిపుణులతో కమిటీ వేసి విచారణ చేస్తారు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా ఎలాంటి విచారణా లేకుండా ఘటనను మాఫీచేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే  విచారణ కమిటీని నియమించలేదని తెలుస్తోంది.
 
సర్కారు వైఫల్యాన్ని కప్పిపుచ్చేలా..
ప్రసూతి విభాగంలో ఉన్న ప్రత్యేక నవజాత శిశు విభాగాన్ని జిల్లా కలెక్టర్ బాబు.ఎ సందర్శించిన సమయంలో సైతం ఒక్కో ఇంక్యుబేటర్‌లో ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచారు. అలా ఉంచడం వల్ల ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డలకు ఇన్ఫెక్షన్ సోకితే ప్రాణాంతకమని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వార్డును సందర్శించిన కలెక్టర్.. లోపాలను ప్రత్యక్షంగా చూసి కూడా బాగానే వైద్యం జరుగుతోందని మీడియాకి చెప్పారు. అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చడమేనని వాదనలు వినిపిస్తున్నాయి.
 
ప్రసూతి విభాగంలోనూ అదే దుస్థితి..
 ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాల కల్పన విషయంలో ప్రభుత్వ వైఫల్యంపై విపక్షాలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు దుమ్మెత్తిపోస్తున్నా వారి తీరులో మాత్రం మార్పు రాలేదు. ప్రతి నిరుపేదకూ మెరుగైన వైద్యం అందిస్తామంటూ  ఊదరగొట్టే నాయకులు ఒక్కసారి ప్రసూతి విభాగానికి వెళితే అక్కడి పరిస్థితి అర్థమవుతుంది. సిజేరియన్ అయిన మహిళలు, పురిటినొప్పులతో బాధపడి అప్పుడే ప్రసవమైనవారు ఒకే బెడ్‌పై ఇద్దరు పడుకుని ఉండడం చూపరులను కలచివేస్తుంది. అక్కడ మంగళవారం కూడా అదే స్థితి నెలకొంది.

 

>
మరిన్ని వార్తలు