అద్భుత నగరంగా అమరావతి

24 Oct, 2015 04:26 IST|Sakshi
అద్భుత నగరంగా అమరావతి

♦ రాజధాని శంకుస్థాపన సభలో చంద్రబాబు
♦ కష్టకాలంలో ఏపీకి మోదీ అండగా నిలిచారు
♦ కేంద్ర సహకారం ఇకముందు కూడా కొనసాగాలి
 
 (అమరావతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు): రాజధానికి శంకుస్థాపన జరిగిన విజయదశమి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ విజయపరంపర కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. విజయదశమి, అమరావతి నగర శంకుస్థాపన.. రాష్ట్రంలో రెండు పండుగలు ఒకేసారి వచ్చాయన్నారు. గురువారం అమరావతికి శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ‘దేశంలోని ప్రముఖ ప్రాంతాలు, గ్రామాలు మొదలైన వాటి నుంచి నీరు, మట్టి సేకరించి వాటితో రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని సంప్రోక్షణ చేశాం. విజయదశమి మంచి రోజు. పవర్ ఫుల్ ముహూర్తం. లగ్నం కూడా మంచిది..’ అని ప్రధానినుద్దేశించి చెప్పారు.

ఇక్కడ వాస్తు కూడా బ్రహ్మాండంగా ఉందని, కృష్ణా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తోందని తెలిపారు. ‘ఇలాంటి రోజున మీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. మీ చేతుల మీదుగా ప్రారంభించిన అన్ని కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. అమరావతి కూడా అద్భుత నగరంగా ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం నాకుంది..’ అని అన్నారు. ‘కష్టకాలంలో ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ అండగా నిలబడ్డారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హరిత, నీలి నగరంగా అమరావతి శోభిల్లాలనేది ప్రధాని ఆకాంక్ష. రాజధాని నిర్మాణానికి రూ. 800 కోట్లు, లోటు భర్తీకి రూ. 2,300 కోట్లు ఇచ్చారు.

11 అత్యున్నత విద్యా సంస్థలు నెలకొల్పారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ. 700 కోట్లు సహకారం అందించారు. మెట్రోలు, విమానాశ్రయాలు, మౌలిక వసతుల కల్పనకు తోడ్పాటు అందిస్తున్నందుకు ధన్యవాదాలు. రాష్ర్ట అభివృద్ధికి ఆయన ఇస్తున్న సహకారానికి ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు. ఏడు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో విలీనం చేసి పోలవరం ప్రాజెక్టుకు నెలకొన్న అవరోధాలను తొలగించారు.

పొరుగు రాష్ట్రాల రాజధానులకు దీటుగా ఏపీ రాజధాని నిర్మించే వరకు కేంద్రం సహకారం అందించాలి. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలి. రాష్ట్రానికి ప్యాకేజీ ఇవ్వాలి..’ అని కోరారు. రాజధానికి మాస్టర్ ప్లాన్ ఇచ్చిన సింగపూర్‌ను చంద్రబాబు అభినందించారు. రైతులు అందించిన సహకారం వల్లే ఇక్కడ రాజధాని నగర శంకుస్థాపన సాధ్యమైందని చెప్పారు. వారికి పాదాభివందనం చేస్తున్నానన్నారు. విభజన చ ట్టంలో లోపాల వల్ల తెలంగాణ రాష్ట్రంతో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఆ ప్రభుత్వం సహకరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 పూర్తి తోడ్పాటు: జపాన్ మంత్రి టకాగి
 అమరావతి నిర్మాణానికి తమ ప్రభుత్వం పూర్తి తోడ్పాటునిస్తుందని జపాన్ మంత్రి యెకు షోటకాగి చెప్పారు. ఆసియా-పసిఫిక్‌కు మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ ద్వారంలా ఉంటుందని చెప్పారు. బుద్ధిజం పరిఢవిల్లిన ప్రాంతం, ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రదేశం కావటం వల్ల ఎంతో వేగంగా అభివృద్ధి సాధిం చేందుకు వీలు కలుగుతుందన్నారు. టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకోవాలని సూచించారు.

 మా దేశానికే గర్వకారణం: సింగపూర్ మంత్రి ఈశ్వరన్
 రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామి కావడం తమకు గర్వకారణమని ఆ దేశ మంత్రి ఈశ్వరన్ చెప్పారు. ఇది తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నామని అన్నారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని భారత ప్రధాని కూడా స్వాగతించారన్నారు. భారత్-సింగపూర్ మధ్య సంబంధాలు మరింత స్థిరపడాలని ఆకాంక్షించారు. సింగపూర్ ప్రభుత్వం కూడా విజయదశమి జరుపుకుంటున్నట్లు తెలిపారు.
 
 తెలుగు రాష్ట్రాలకు సహకారం:వెంకయ్యనాయుడు
 తెలుగుజాతి శ్రేయోభిలాషిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి ఢిల్లీ స్థాయిలో సహ కరిస్తానని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఏపీకి ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు విభజన చ ట్టంలోని అన్ని అంశాల అమలుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ‘అమరావతిని చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాజులు పరిపాలించారు. తెలుగు వారి ఐక్యతకు కృషి చేశారు. మనం కూడా చరిత్ర సృష్టిద్దాం. తెలుగు ఔన్నత్యాన్ని చాటుదాం..’ అని అన్నారు.
 
 తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది: కేసీఆర్
 అమరావతి నగర ప్రస్థానం అద్భుతంగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. పవిత్రమైన విజయదశమి నాడు ప్రధాని చేతుల మీదుగా ఏపీ రాజధానికి శంకుస్థాపన జరగటం ఆనందదాయకమని, ఏపీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.

మరిన్ని వార్తలు