భక్తవ శంకర..నమో నమో!

22 Feb, 2017 22:36 IST|Sakshi
భక్తవ శంకర..నమో నమో!
- పుష్పపల్లకీలో విహరించిన మల్లన్న
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాజ్ఞరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగమ్బరాయ!
తస్మైనకారాయ నమశ్శివాయా !!
సర్పాలను హారములుగా ధరించినవాడు, మూడు నేత్రములు కలవాడు, విభూదిని శరీరం నందు పూసుకున్నవాడు, పరిశుద్దుడును, దిక్కులే వస్త్రములు కలవాడు, నకార రూపుడు అయిన శివునికి నమస్కారమని అర్థం.
 
లయకారుకుడైన పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపుడిగా శ్రీశైలంలో కొలువయ్యారు.  మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమశివుని లింగోద్భవకాల దర్శనాన్ని చేసుకోవడానికి లక్షలాదిగా చేరుకుంటున్న భక్తజనంతో క్షేత్రం కిటకిటలాడుతోంది. మల్లన్న మహిమలను కథలు కథలుగా శివభక్తులు చెప్పుకుంటూ ఆధ్యాత్మికానందానికి లోనవుతున్నారు. ఆకుంఠిత దీక్షతో పాదయాత్రగా శ్రీశైలం చేరుకుని ముక్కంటి దర్శనం చేసుకుని శివధ్యానంలో నిమగ్నమవుతున్నారు. ఏకాగ్రతతో శివుని ధ్యానిస్తే దొరకని శుభఫలితం లేదు. అసలు శివం అంటేనే శుభమని, శుభాలను చేకూర్చేవాడు కనుకనే ఆయన శివుడు అంటారు.
 
పుష్పపల్లకీలో మల్లన్న వైభవం..
అభిషేక ప్రియుడు అయిన శ్రీ మల్లికార్జునస్వామి దేవేరి భ్రామరితో కలిసి బుధవారం పుష్పపల్లకీలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మల్లికార్జునస్వామికి పుష్పపల్లకీ మహోత్సవాన్ని నిర్వహించి పరిపూర్ణంగా స్వామివార్ల కైంకర్యాలను నిర్వహించాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈఓ నారాయణభరత్‌గుప్త  తెలిపారు. బుధవారం  సాయంత్రం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి కల్యాణమండపంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులకు విశేష వాహనసేవలు నిర్వహించాక ఆలయ ప్రదక్షిణ చేయించారు. అనంతరం ఊరేగింపుగా రథశాల వద్దకు చేర్చి పుష్పాలంకృతశోభతో కళకళలాడుతున్న పల్లకీలో ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. పల్లకీ కోసం తెలుపు, పసుపు చామంతులు, ఎరుపు, పసుపు బంతిపూలు, కనకాంబరం, నందివర్ధనం, కాగడా..తదితర 18రకాల పుష్పాలను ఉపయోగించారు. అలాగే 600 కేజీలకు పైగా పూలను, 6వేల విడిపుష్పాలు (కట్‌ప్లవర్స్‌) వినియోగించి అత్యంత సుందరంగా పుష్ప పల్లకీని తీర్చిదిద్దారు.  ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్‌ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు, డీఎస్పీ రాజశేఖరరాజు, ఈఈ రామిరెడ్డి, సంబం«ధిత విభాగాధిపతులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు