‘మార్చి 24న అసెంబ్లీ ఎదుట ధర్నా’ | Sakshi
Sakshi News home page

‘మార్చి 24న అసెంబ్లీ ఎదుట ధర్నా’

Published Wed, Feb 22 2017 10:37 PM

march 24th dharna at assembly

అనంతపురం అర్బన్‌ : వరస కరువులతో కుదేలైన జిల్లా రైతాంగాన్ని  ఆదుకోవాలనే డిమాండ్‌తో మార్చి 24న అసెంబ్లీ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్‌ తెలిపారు. పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు, రైతులు దుస్థితిని పరిశీలించేందుకు మార్చి 3, 4వ తేదీల్లో సేలం, కోయంబత్తూరు, కొచ్చిన్, బెంగుళూరు వెళ్తున్నామన్నారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎదుట నిర్వహించే ధర్నాకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట కార్యదర్శి పి.మధు, ఏపీసీసీ అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డిని ఆహ్వానిస్తున్నామన్నారు. 

63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కనీస స్థాయిలో కూడా సహాయక చర్యలు చేపట్టలేదని ధ్వజమెత్తారు. ఇన్‌పుట్‌ సబ్సిడీని ఎగ్గొట్టి రైతులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో అప్పుల బాధతో 243 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఐదు లక్షల మంది కూలీలు, రైతులు పొరుగు రాష్ట్రాలకు వలసవెళ్లి దుర్భర జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్న ప్రభుత్వానికి కనిపించకపోవడం దారుణమన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement