బైక్‌ రేసింగ్‌ వల్లే ఆ ప్రమాదం?

12 Aug, 2016 23:22 IST|Sakshi
బైక్‌ రేసింగ్‌ వల్లే ఆ ప్రమాదం?
రెండు మోటారు సైకిళ్ల ఢీ ఘటనలో కొత్త కోణం 
ప్రమాదంలో మరో వ్యక్తి ఉన్నట్టు గుర్తింపు
 
రావులపాలెం: రావులపాలెం కెనాల్‌ రోడ్డులో గురువారం ఇద్దరి మృతికి కారణమైన రెండు మోటారు సైకిళ్ళ ఢీ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన పడాల సత్యవెంకటసాయిబాబారెడ్డి(34) తన ఇద్దరు కుమార్తెలతో మోటారు సైకిల్‌పై  స్కూల్‌ నుంచి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన గొలుగూరి కోమల సాయి తేజ వినయ్‌కాంత రెడ్డి(18) మోటారు సైకిల్‌పై వస్తూ ఢీకొనడంతో ఇద్దరూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో వినయ్‌ కాంత రెడ్డి ఒక్కడే మోటాటరు సైకిల్‌పై ఉన్నట్టు తొలుత పోలీసులు భావించారు.

అయితే బైక్‌ రేసింగ్‌ చేస్తూ అతి వేగంతో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఊబలంక రోడ్డులో ఉన్న ఒక సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా వినయ్‌కాంత రెడ్డి మోటార్‌సైకిల్‌పై మరో వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. ఆ వ్యక్తి గ్రామానికి చెందిన కర్రి అజయ్‌కుమార్‌రెడ్డి అని, అతనే  మోటారుసైకిల్‌ నడపగా వినయ్‌కాంతరెడ్డి వెనుక కూర్చున్నట్టు ఆ వీడియోలో తేలింది. వారు ఊబలంక వైపు నుంచి రావులపాలెం వైపు వస్తున్నట్టు ఆ వీడియోలో పోలీసులు గుర్తించారు. దీనిపై ఎస్సై పీవీ త్రినాథ్‌ను వివరణ కోరగా కర్రి అజయ్‌కుమార్‌రెడ్డి మోటారు సైకిల్‌ నడుపుతున్నట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. అతనికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయయని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. 

 బైక్‌ రేసింగే కారణమా? 
బైక్‌ రేసింగే ఈ ప్రమాదానికి కారణమనే ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా రెండు మోటారు సైకిళ్లు ఢీకొంటే ఈ స్థాయిలో ప్రాణ నష్టం ఉండదని, మితి మీరిన వేగంతో వాహనాలు ఢీకొంటేనే ఈ స్థాయిలో ప్రమాదం జరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వినయ్‌కాంత రెడ్డి మోటారు సైకిల్‌ అధిక సీసీ కలిగిన స్పోర్ట్స్‌ బైక్‌ వంటిది కావడంతో రేసింగ్‌ జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామంలో బైక్‌ రేసింగ్‌ జరుగుతున్నట్టు ఆరోపణ లు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి దీనికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.   
 
మరిన్ని వార్తలు