డోస్.. ఎక్కువైతే ఖలాస్

9 Mar, 2016 03:40 IST|Sakshi
డోస్.. ఎక్కువైతే ఖలాస్

ఒళ్లు నొప్పుల మాత్ర లు వాడకం
మితి మీరితే అనారోగ్య సమస్యలు
వ్యాధులు ‘కొని’తెచ్చుకుంటున్న
సామాన్యులు అవగాహన లోపమే ప్రధాన కారణం

సంగారెడ్డి టౌన్: చమటోడ్చే కర్షకుడైనా.. ఒళ్లుగుల్ల చేసుకునే కార్మికుడైనా.. అలసిపోయే గృహిణులైనా.. ఆఫీసులో టెన్షన్ పడే ఉద్యోగులైనా.. కాస్తంత నిస్సత్తుగా అనిపిస్తే వెంటనే ఓ గోళి వేసుకుంటారు. ఇలా ఒళ్లు నొప్పుల తగ్గడం కోసం వేసుకునే మందుల డోస్ ఎక్కువైతే ప్రాణాలకే ముప్పు! అవగాహన లోపం, అమాయకత్వంతో అనేక మంది నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలు చావును ‘కొని’తెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో ఈ తరహా ‘సొంత వైద్యం( ఎక్కువైపోయింది.

 తక్కువ ధరకే..
రూ.1 నుంచి రూ.2కే లభించే డెక్సారిడ్(డెక్సా మోటాతాసోన్) బెటామోతాసోన్, డైక్లోఫినాక్ సోడియం అండ్ పారాసిటమాల్ అనే రెండు మాత్రలు అతి తక్కువ ధరకే లభిస్తాయి. ఈ మాత్రలు అన్ని మందుల దుకాణాల్లో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే అందజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మందుల దుకాణాలతో పాటు కొన్ని కిరాణ దుకాణాల్లో సైతం విరివిగా లభిస్తాయి. ఈ రెండు మాత్రలను ఉపయోగించడం వల్ల ఒంటి నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. కానీ, వీటిని ప్రతిరోజు వాడటం వల్ల లేని వ్యాధులు సంక్రమించే ప్రమాదం వుంది.

 కోట్లలో అమ్మకాలు..
వ్యవసాయ కూలీల నుంచి మొదలుకొని ఆటో వాలాలు, చేతి వృత్తులవారు, చిరు వ్యాపారులు రోజంతా కష్టపడటం వల్ల ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. వీటి నుంచి విముక్తి పొందేందుకు చాలా మంది ఈ మాత్రలను వాడుతున్నారు. దీంతో కొందరు వీటికి బానిసలవుతున్నారు. ఈక్రమంలో ప్రతి మందుల షాపుల్లోనూ సాధారణ జ్వరంతో పాటు డైక్లోఫినాక్ సోడియం అండ్ పారాసిటమాల్ మాత్రలకు డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మాత్రలపై ఏటా దాదాపు రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని ఓ డ్రగ్ డీలర్ ‘సాక్షి’కి వివరించారు.

మితిమీరితే ప్రమాదమే..
ఈ మాత్రలను మితిమీరి ఉపయోగించడం వల్ల అప్పటికప్పుడు ఒళ్లు నొప్పుల నుంచి విముక్తి లభించినా శాశ్వత రోగాలకు దారితీస్తాయి. కిడ్నీ, మూత్రపిండాల వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. సుగర్, బీపీ, మెడపై కొవ్వు పేరుకుపోవడం, శరీరం లావెక్కడం, ఎముకలు బలహీన పడటం, ఎముకలు సులువుగా విరిగిపోవడం, అల్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. డెక్సారిడ్(డెక్సామోటాతాసోన్) బెటామెతాసోన్, డైక్లోఫినాక్ సోడియం అండ్ పారాసిటమాల్ మాత్రలు వాడటం వల్ల ముఖ్యంగా మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
- డాక్టర్ రాజు గౌడ్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్,  సంగారెడ్డి

మరిన్ని వార్తలు