ఈ బాలుడికి...ఏదీ ‘ఆధారం’

19 May, 2017 23:57 IST|Sakshi
 • - ఒకే పేరుతో ఐదు ఆధార్‌ కార్డులు
 • - అసలు నంబరేదో తెలియక తికమక
 • -  సమన్వయలోపంతో బయటపడిన నిర్లక్ష్యం.
 • రామచంద్రపురం: 
  ‘ ఆధార్‌ కార్డు రావాలంటే సవాలక్ష నిబంధనలు ... ఒకసారి నంబరు ఖరారైందంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా అదే ‘ఆధారం’. అందుకే అన్నింటా ఆధార్‌ లింక్‌ చేశారు. ఈ హడావుడి చూస్తే ఎంతో పక్కాగా సాగుతుందోనని అనిపిస్తోంది కదూ. కానీ రామచంద్రాపురం పట్టణంలోని కొత్తూరులో ఘటన వింటే ‘ఇదేమిటీ కొత్త పితలాటకం’ అని ముక్కున వేలేసుకుంటారు. ఇక్కడ నాలుగేళ్ల బాబుకు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు ఆధార్‌ కార్డులు మంజూరు చేసేసిన వైనం బయటపడింది. రామచంద్రాపురం ఒకటో వార్డులోని మడికి లక్ష్మీ సుజాత కుమారుడు మడికి ధర్మ అనే బాలుడికి ఆధార్‌కార్డులు పోస్టు ద్వారా వచ్చాయి. ఆ కవరు విప్పి చూడగా పేరు ఒక్కటే ... వేర్వేరు నంబర్లతో ఐదు ఆధార్‌ కార్డులు రావటంతో ఏది ఉంచుకోవాలో తెలియక అయోమయానికి గురయ్యారు. 
  .
  ‘ఆధార్‌’ నమోదు ఇలా...
  సాధారణంగా ‘ఆధార్‌’ నమోదు కోసం మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తును తీసుకోవాలి. ఈ దరఖాస్తు నింపిన తరువాత ఇందులో సమాచారం నిజమేనని సంబంధిత వీఆర్వోతో ధ్రువీకరించాలి. తల్లిదండ్రుల ఆధార్‌ కార్డుల జిరాక్స్‌లో మీసేవా సెంటర్‌లో వేలిముద్రలు తీసుకొని ఐరిష్‌తో నమోదు చేస్తారు. 
  .
  జరుగుతుందిలా... 
  గతంలో కొంత మంది ప్రయివేటు ఏజెన్సీలకు ఆధార్‌ నమోదు బాధ్యతను అప్పగించారు. సంబంధిత కిట్లు వారి వద్దనే ఉండిపోవటం, అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో ఆయా ప్రవేటు వ్యక్తులు ఊరూరా తిరిగి ఇంటింటికీ వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా వీఆర్వోల ధ్రువీకరణ లేకుండానే ఎన్‌రోల్‌మెంట్‌ను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌కు రూ.100 నుంచి రూ. 200 వరకూ వసూలు చేస్తున్నారు. ఈవిధంగా జిల్లాలోని పలు డివిజన్ల పరిధిలో ఈ తతంగం సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రామచంద్రపురం డివిజన్‌లోని రాయవరం, రామచంద్రపురం, కె.గంగవరం. కాజులూరు, మండపేట, అనపర్తి, బిక్కవోలు మండలాలతోపాటుగా మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలు కాకినాడ డివిజన్, అమలాపురం తదితర డివిజన్‌ పరిధిలోని మండలాల్లో కూడా ఇటువంటి వ్యవహారం అధికంగా సాగుతున్నట్టు సమాచారం. ఇంటింటికీ వెళ్లి నమోదు చేస్తున్నవారికి  సరైన అవగాహన లేకపోవటం, వీఆర్వోల ధ్రువీకరణ లేకుండానే అశాస్త్రీయంగా ఒకరినే పలుమార్లు ఎన్‌రోల్‌ చేస్తుండడంతో ఈ పొరపాట్లు జరుగుతున్నాయని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి 
   
   
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు