కాల్‌నాగ్‌లు- మళ్లీ బుసలు కొడుతున్నాయ్‌

1 Nov, 2016 22:31 IST|Sakshi

– జిల్లాలో మళ్లీ కాల్‌మనీ వేధింపులు
– గుత్తిలో అప్పున్న ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడు
– పోలీసుల జోక్యంతో క్షేమంగా ఇంటికి
– కరువు దెబ్బతో జీవనోపాధికి అప్పులు చేస్తున్న రైతులు, కూలీలు
– కాల్‌మనీ వేధింపులకు మూల సమస్య...రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడమే
– బయటపడేందుకు వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్న వైనం


సాక్షిప్రతినిధి, అనంతపురం : జిల్లాలో మళ్లీ కాల్‌నాగులు బుసలు కొడుతున్నాయి. భారీ వడ్డీలకు అప్పులిచ్చి, వాటిని వసూలు చేసేందుకు వేధింపులకు దిగుతున్నారు. గతేడాది కృష్ణా జిల్లాలో తెరపైకి వచ్చిన 'కాల్‌మనీ' ఉదంతంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోనూ వడ్డీవ్యాపారుల నుంచి ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలతో కొద్దికాలంపాటు మౌనంగా వ్యవహారాలు చక్కబెట్టిన కాల్‌మనీ మాఫియా మళ్లీ విజృంభిస్తోంది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఓ ఘటనతో మళ్లీ  వేధింపులు ఉన్నాయనేది స్పష్టమవుతోంది.  అనంతపురం నగర పాలక వర్గంలోని ఓ ప్రజాప్రతినిధి తనయుడు గుత్తిలోని ఓ వ్యక్తికి రూ.25లక్షల అప్పు ఇచ్చాడు. ఈ డబ్బు చెల్లించలేదని సోమవారం సదరు వ్యక్తిని గుత్తిలో కిడ్నాప్‌ చేసి 'అనంత'కు తీసుకువచ్చారు. ఈ వ్యవహారం పోలీసులకు తెలియడంతో జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని తిరిగి పంపేశారు.

    జిల్లాలో అసలే కరువు పరిస్థితి. పంటల సాగుకు  బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు కూడా చెల్లించలేని పరిస్థితి. ఈ క్రమంలో పిల్లల చదువులు, జీవనోపాధికి అధికవడ్డీలతో ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకుంటున్నారు.  సకాలంలో చెల్లించలేక వడ్డీవ్యాపారుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు.  రైతులతో పాటు చిరువ్యాపారులు, ఉద్యోగులు..ఇలా అన్ని వర్గాల ప్రజలకు 'కాల్‌మనీ' కష్టాలు ఉన్నాయి.  

వసూళ్లు ఇలాఽ...
ఉదాహరణకు మైనుద్దీన్‌ అనే వ్యక్తికి రూ.10వేలు అవసరం వచ్చింది. వడ్డీ వ్యాపారిని ఆశ్రయించాడు.  రూ.10వేలు...పదివారాలకు చెల్లించేలా అప్పు ఇచ్చాడు. పదివారాలకు వెయ్యి రూపాయల వడ్డీ అని చెప్పి ఆ సొమ్మును ముందే పట్టుకున్నాడు. చేతికి రూ.9వేలు ఇచ్చాడు. అలాగే లక్ష్మి అనే మహిళకు రూ.10వేలు అవసరం కావడంతో వడ్డీవ్యాపారితో తీసుకుంది. వందకు రూ.10 చొప్పున పదివేలకు వారానికి రూ.వెయ్యి ఽవడ్డీ చెల్లించాలి. అసలు రెన్నెళ్లకు చెల్లిస్తారా, రెండేళ్లకు చెల్లిస్తారా అనేది వడ్డీవ్యాపారి పట్టించుకోడు. ప్రతివారం రూ.వెయ్యి వడ్డీ ఇస్తే అసలు ఎంతకాలమున్నా అడగడు. ఒకవేళ నాలుగువారాలు చెల్లించలేకపోతే ఈ నాలుగువేలు కూడా అసలులో జమ చేసుకుని వడ్డీసొమ్మును  రూ.1400కు పెంచుతాడు. జిల్లాలో ఇలా పేదల నడ్డి విరిచేలా వడ్డీ వసూలు చేస్తున్నారు.  

'అనంత'లో వసూల్‌ రాయుళ్లు అధికం
    అధిక వడ్డీలు వసూలు చేసే దందాకు  కాల్‌మనీ మాఫియా పెట్టుకున్నపేరు 'ఫైనాన్స్‌'! ఈ దందా నడుపుతున్న వారిలో 'అనంత'లోని ద్వారకానగర్‌కు చెందిన ఓ నాయుడు, చౌదరి ఉన్నారు. రాంనగర్‌లో భారీమీసాలు, ఒంటిపై అరకిలో బంగారంతో దందా నడిపే వ్యక్తి, ఇదే ప్రాంతంలో మరో వ్యక్తి ఉన్నారు.  ధర్మవరంలో 'సినిమా' థియేటర్‌ నడుపుతున్న ఓ వ్యక్తి కాల్‌మనీతోనే ఆర్థికంగా ఎదిగారు. ఇప్పుడు కూడా వడ్డీవ్యాపారాన్ని ధర్మవరంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరింపజేశారు. ఇదే మండలంలో ఓ వ్యక్తి ఇటీవల ఒకరిని కిడ్నాప్‌ చేసి రూ.11 లక్షల అప్పు ఉన్నట్లు బాండు రాయించుకున్నారు. అలాగే అనంతపురం సర్వజన ఆస్పత్రిలోని ఇద్దరు ఉద్యోగులు కూడా కాల్‌మనీ వ్యవహారం నడుపుతున్నారు.గుంతకల్లు, కదిరి, హిందూపురం, తాడిపత్రితో పాటు చాలా పట్టణాల్లో ఈ తరహా వేధింపులు అధికమవుతున్నాయి. అనంతపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసుస్టేషన్లకు వచ్చే ప్రతి పది కేసుల్లో కనీసం నాలుగు 'కాల్‌మనీ' వ్యవహారాలే కావడం గమనార్హం. ఈ క్రమంలో పోలీసులు మరోసారి ప్రత్యేకదృష్టి సారించాల్సి ఉంది.

 బాధితుల్లో అధికశాతం డ్వాక్రా మహిళలే
            జిల్లా వ్యాప్తంగా 52 వేల డ్వాక్రా సంఘాలలో 5.40 లక్షలమంది సభ్యులు ఉన్నారు. వీరు 2014 ఎన్నికల నాటికి  రూ.990 కోట్ల బకాయిలు ఉన్నారు. వీటన్నిటినీ మాఫీ చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఒక్కో సంఘం 4–7 నెలల వరకూ రుణాలు చెల్లించలేదు. సీఎం అయిన తర్వాత చంద్రబాబు మాట తప్పారు. మాఫీ ప్రకటనను అటకెక్కించారు. దీంతో బకాయిలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు పంపి ఒత్తిడి పెంచారు.  తప్పని పరిస్థితుల్లో అధికవడ్డీలకు అప్పులు చేసి కాల్‌మనీ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ అప్పులను సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీవ్యాపారులు వేధింపులకు దిగారు. దీంతో తిరిగి మరో వ్యక్తి వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. ఇలా తాత్కాలిక ఉపశమనం కోసం మరోచోట అప్పు చేయడం మినహా ఈ ఊబి నుంచి బయటపడలేకపోతున్నారు. ఇదే పరిస్థితిని చాలామంది రైతులు కూడా ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు