న్యాయవ్యవస్థలో మార్పులు రావాలి

24 Aug, 2016 19:18 IST|Sakshi
-న్యాయమూర్తుల నియామకంలో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ప్రాధాన్యం కరువు
- తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్
సాక్షి ప్రతినిధి, తిరుపతి 
 భారత న్యాయ వ్యవస్థలో మార్పులు ఎంతో అవసరమని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గాలకు న్యాయం సులభంగా అందేలా మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మనది గొప్ప ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ అందరికీ న్యాయం అందడం లేదన్నారు. పవర్ ఫర్ ఎవర్ అన్న చందాన డబ్బున్న వారికే న్యాయం త్వరగా దొరుకుతుందన్నారు. బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతా మోహన్ మాట్లాడారు. 
 
125 కోట్ల భారత జనాభాలో 109 కోట్ల మంది బీసీ, ఎస్సీ, గిరిజన,మైనార్టీలు ఉన్నారనీ, ఈ సామాజిక వర్గాలకు చెందిన ఒక్కరికి కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్రాతినిధ్యం దొరకలేదన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్న ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ముగ్గురు కీలక న్యాయమూర్తులుగా ఉన్నారన్నారు. న్యాయవాదుల ఫీజులు పెరగడంతో న్యాయం అనేది పేదలకు దూరమవుతుందన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే రూ.1 కోటి, హైకోర్టుకు వెళ్లాలంటే రూ.10 లక్షలు ఉండాల్సిందేనన్నారు. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం దక్కడం లేదన్నారు. తాను వ్యక్తులను తప్పుపట్టడం లేదనీ, వ్యవస్థలోని లోపాలను చెబుతున్నానన్నారు. ఇదేనా సామాజిక న్యాయం? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై తాను వ్యక్తిగా పోరాటం చేయాలనుకుంటున్నట్లు మోహన్ చెప్పారు. అవసరమైతే భారత రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేస్తానన్నారు. 
 
 
మరిన్ని వార్తలు