పందేలదే పైచేయి

13 Jan, 2017 21:31 IST|Sakshi
పందేలదే పైచేయి
 పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు
 కోర్టు ఉత్తర్వులు బేఖాతర్‌
 గాలిలోకి కాల్పులు జరిపి ప్రారంభించిన వైనం
 చేతులు మారుతున్న రూ.కోట్లు
 144 సెక‌్షన్‌ ప్రకటించిన కలెక్టర్‌
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
భోగి రోజున పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు యథేచ్ఛగా జరిగాయి. అధికార పార్టీ నేతలే ముందుండి నడిపించడంతో గురువారం రాత్రివరకూ హడావుడి చేసిన పోలీసులు శుక్రవారం పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు జరిగాయి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం కోడి పందాల్లో తెలంగాణ పరిధిలోని ఖమ్మం, ఏపీ పరిధిలోని పశ్చిమ గోదావరి జిల్లాల పందేల రాయుళ్ల మధ్య భారీ పందేలు జరిగాయి. ఇక్కడ ఖమ్మం జిల్లా జూబ్లీపుర గ్రామానికి చెందిన గంగవరపు లక్ష్మీదయాకర్‌ అనే వ్యక్తి పందేల ప్రారంభం సందర్భంగా తన లైసెన్స్‌ రివాల్వర్‌తో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ విషయం తెలిసిన కొన్నిగంటల తరువాత అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. ఏటా మాదిరిగానే ముందువరకూ ఉత్కంఠ నెలకొన్నా సంక్రాంతి సంబరాల్లో తొలిరోజైన భోగినాడు జిల్లావ్యాప్తంగా పందెం కోళ్లకు రెక్కలు తెగాయి. హైకోర్టు ఉత్తర్వులు, దానిపై సుప్రీంకోర్టు స్పందనతో చివరి రోజు వరకూ పందేలను అడ్డుకున్నా భోగి రోజున చేతులెత్తేశారు. ఉదయం 11 గంటల తర్వాత ప్రభుత్వం నుంచి అనధికారిక ఉత్తర్వులు రావడంతో పోలీసులు తప్పుకున్నారు. నిడమర్రు మండలం పత్తేపురంలో, భీమడోలు మండలం గుండుగొలను బరుల్లో పందేలను ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ పందాల్లో పాల్గొన్నారు. పెదవేగి మండలం కొప్పాకలో ప్రభుత్వ విప్‌ చింతమనేని ఆధ్వర్యంలో కోడిపందేలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో  భారీగా పందాలు నిర్వహించారు. తెలంగాణ నుంచి కోడి పందేల రాయుళ్లు భారీగా తరలి వచ్చారు. రూ.లక్షల్లో పందాలు జరిగాయి. పందేల ముసుగులో కోతాట, గుండాట, మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయి. పోలీసులు కనీసం కన్నెత్తి కూడ చూడలేదు. ఆచంట మండలం వల్లూరులో కోడి పందేల బరిని వేలం పాట నిర్వహించగా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రూ.2 లక్షలకు పాడుకున్నట్టు సమాచారం. అకివీడు మండలం ఐ.భీమవరంలో హైడ్రామా నడిచింది.  గ్రామంలోని ప్రధాన బరిగా ఉన్న ఎఫ్‌సీఐ గోడౌన్ల ప్రాంతంలో కోడి పందేలు వేయరాదంటూ పోలీస్, రెవెన్యూ యంత్రాంగం తిష్ట వేశాయి. పందెంరాయుళ్లు గొడవకు దిగినా తహసీల్దార్‌ ఒప్పుకోలేదు. పోలేరమ్మ గుడివద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డింకీ పందాలను ఎమ్మెల్యేతో ప్రారంభించేందుకు నిర్వాహకులు నిర్ణయించి ఎమ్మెల్యే కలవపూడి శివను ఆహ్వానించారు. ఎమ్మెల్యే చెప్పడంతో మధ్యాహ్నం నుంచి ప్రధాన బరిలో కూడా కోడిపందేలు జరిగాయి. భీమవరం మండలం వెంప, తోకతిప్ప గ్రామాల్లో భారీ పందాలు వేస్తుండగా దిరుసుమర్రు, ఈలంపూడి, వీరవాసరం మండలంలోని కొణితివాడ, నవుడూరు, ఉత్తరపాలెం, అండలూరు, వీరవాసరం, నందమూరుగరువు తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. వీరవాసరం మండలం కొణితివాడ చుట్టుపక్కల గ్రామాల ఏడు చిన్నచిన్న గ్రామాల్లోని సంఘ పెద్దలు ఉత్తరపాలెంలో నిర్వహించే కోడి పందాలకు పోటీగా మరొక బరిని సిద్ధం చేయడంలో అక్కడి మహిళలు అడ్డుకున్నారు. తొలిరోజు పందాలకు ప్రముఖులు ఎవరూ హాజరు కాకపోయినప్పటికీ మండలస్థాయిలోని టీడీపీ నాయకులు నిర్వహణ బాధ్యతలు తీసుకుని జోరుగా నిర్వహించారు.
 
మరిన్ని వార్తలు