కలెక్టర్‌ కారు, ఫర్నిచర్‌ జప్తునకు నిర్ణయం

24 Oct, 2016 23:46 IST|Sakshi
– విలువను లెక్కించేందుకు అమీనాను పంపించిన హైకోర్టు
– రైతుకు పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన ఫలితం
ఏలూరు (మెట్రో) :
పోలవరం ప్రాజెక్ట్‌ కుడికాలువ నిర్మాణంలో భాగంగా 1997లో భూమిని సేకరించిన సందర్భంలో అధికారులు చేసిన తప్పిదానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్‌ కె.భాస్కర్‌ వినియోగిస్తున్న కారును, కలెక్టరేట్‌ భవనంలోని ఫర్నిచర్‌ను జప్తు చేయాలని నిర్ణయించిన హైకోర్టు.. వాటి విలువను అంచనా వేసేందుకు అమీనాను సోమవారం ఇక్కడకు పంపించింది. వివరాల్లోకి వెళితే.. పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన పి.శ్రీనివాసరావు అనే రైతు తన పొలం మధ్యనుంచి పోలవరం ప్రాజెక్ట్‌ కుడి కాలువ వెళ్లేలా డిజైన్‌ చేశారని, కాలువ అలైన్‌మెంట్‌ మార్చాలని 1997లో అప్పటి అధికారులను కోరాడు. స్పందించిన అధికారులు కాలువ పొలం మధ్యనుంచి కాకుండా చివరినుంచి నిర్మాణం చేపడితే ఎటువంటి అభ్యంతరం లేదంటూ ఆ రైతు నుంచి రాతపూర్వకంగా తీసుకున్నారు. ఆ తరువాత ఇరిగేషన్‌ అధికారులు కాలువ నిర్మాణ పనులు చేపట్టారు. అదే రైతుకు చెందిన పొలం చివరి భాగంలో ఎకరం మేర ముంపునకు గురైంది. ముంపునకు గురైన పొలానికి నష్టపరిహారం ఇవ్వాలని ఆ రైతు అధికారులను కోరాడు. ఇందుకు అధికారులు నిరాకరించారు. దీంతో రైతు శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించి కలెక్టర్‌ను కూడా ప్రతివాదిగా చేర్చాడు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్, కలెక్టర్‌ కారును జప్తు చేసి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు నిర్ణయించింది. దీంతో హైకోర్టు అమీనా సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌ కారును, ఫర్నిచర్‌ విలువను అంచనా వేశారు. దీనిపై ఇరిగేషన్‌ అధికారులను వివరణ కోరగా, దీనిపై స్టే కోసం కోర్టుకు వెళుతున్నట్టు చెప్పారు. 
కోర్టు విషయంలో నిర్లక్ష్యమేల 
జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఈ విషయమై ఇరిగేషన్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో ఆయన ఆ శాఖ అధికారులను మందలించారు. కోర్టు కేసుల విషయంలోనూ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. తక్షణమే సదరు కేసుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
మరిన్ని వార్తలు