283 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య

16 Sep, 2016 19:25 IST|Sakshi
– టీచర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం
ఏలూరు సిటీ : జిల్లాలోని 283 ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి కంప్యూటర్‌ విద్యను ప్రారంభిస్తున్నామని, కంప్యూటర్‌ విద్యను బోధించేందుకు టీచర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈవో డి.మధుసూదనరావు శుక్రవారం తెలిపారు. ఏడు నెలల కాలానికి తాత్కాలిక పద్ధతిలో కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌గా పనిచేసేందుకు అసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఖాళీల వివరాలను పాఠశాలల వారీగా డీఈవో వెస్ట్‌ గోదావరి వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. మరిన్ని వివరాలకు ఉప విద్యాధికారులను సంప్రదించాలని తెలిపారు. అభ్యర్థులు డిగ్రీ, పీజీ స్థాయిలో కంప్యూటర్‌ ఒక సబ్జెక్టుగా చదివిఉండాలన్నారు. 21 సంవత్సరాలు నించి 40 సంవత్సరాలు మించకూడదని తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 19 తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు ఆన్‌లైన్‌లో చేయాలని, 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులకు ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షను ఏలూరులో నిర్వహిస్తామని, మండలం యూనిట్‌గా మెరిట్‌ కమ్‌ రోస్టర్‌ ప్రాతిపదికన ఎంపికలు చేపడతామని తెలిపారు. మండల స్థానికులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనంగా రూ.6 వేలు గౌరవవేతనంగా చెల్లిస్తారన్నారు. హాల్‌టిక్కెట్స్, పరీక్షా కేంద్రాలను వెస్ట్‌గోదావరి డాట్‌ ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపారు. 
 
మరిన్ని వార్తలు