హరితహారంపై సీఎస్‌ సమీక్ష

19 Jul, 2016 23:28 IST|Sakshi
హరితహారంపై సీఎస్‌ సమీక్ష
  • పాల్గొన్న కలెక్టర్, మంచిర్యాల ఆర్డీవో
  • మంచిర్యాల రూరల్‌ : రెండో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించి లక్ష్యం, సాధించిన ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం హైదరాబాద్‌ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంచిర్యాల ఆర్డీవో కార్యలయంలో కలెక్టర్‌ జగన్మోహన్, ఆర్డీవో అయిషా మస్రత్‌ ఖానమ్‌ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో వర్షాల ప్రభావంతో హరితహారం లక్ష్యం చేరుకోలేకపోయామని తెలిపారు. ఈ నెల 23వ తేదీలోగా 80 శాతం లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. ఆయా శాఖల వారీగా నాటిన మొక్కల వివరాలు ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు. సోషల్‌ ఫారెస్ట్రీ 12 వేలు, జిల్లాలో గల 6 డివిజన్‌ ఫారెస్ట్‌లలో 35 లక్షల 28 వేలు, డ్వామాలో 2 కోట్లు లక్ష్యం కాగా.. ఈ నెల 25, 26 తేదీల్లో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. విద్యాశాఖ ద్వారా 100 శాతం హరితహారం సాధించినట్లు పేర్కొన్నారు. రోడ్లు, భవనాల శాఖ ఇప్పటివరకు 29 కిలోమీటర్ల మేర మొక్కలు నాటిందని వివరించారు. ఇరిగేషన్‌ శాఖ కూడా 30 వేలకు గానూ 39 వేల మొక్కలు నాటి అధిక లక్ష్యం సాధించిందని తెలిపారు. ఉద్యానవన శాఖ ద్వారా అర్బన్‌ ప్రాంతాల్లో పండ్లు, పూల మొక్కలు పెద్ద ఎత్తున పంపిణీ చేసినట్లు చెప్పారు. హరితహారం కార్యక్రమంలో సింగరేణి సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ స్వయంగా పాల్గొని మొక్కలు నాటారని తెలిపారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు 4 లక్షల మొక్కలు, ఇతర బ్యాంకులు 50 వేల మొక్కలు నాటాయని వివరించారు. నాటిన మొక్కలు సంరక్షించేలా చర్యలు తీసుకుంటూ తగిన సూచనలు చేస్తున్నామని కలెక్టర్‌ సీఎస్‌కు తెలిపారు.
మరిన్ని వార్తలు