పెళ్లింట.. జన్‌ధన్‌ ఖాతా తంటా

12 Dec, 2016 15:17 IST|Sakshi
పెళ్లింట.. జన్‌ధన్‌ ఖాతా తంటా
మొగల్తూరు: వివాహ ముహూర్త పత్రం చూపిస్తున్న ఈయన పేరు పాలా వెంకటేశ్వరరావు. మొగల్తూరులోని కుక్కల వారితోటలో నివాసం ఉంటున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే ఈయనకు ఐదుగురు కుమార్తెలు. పక్కన బ్యాంక్‌ పాస్‌ బుక్‌ చూపిస్తున్న యువతి వెంకటేశ్వరరావు నాలుగో కుమార్తె శ్రీలక్ష్మి. కోమటితిప్ప గ్రామానికి చెందిన రామకృష్ణతో ఆమెకు వివాహం నిశ్చయమైంది. డిసెంబర్‌ 21వ తేదీన పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. ఈనెల 28న పెళ్లి పనులకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. వివాహ ఖర్చుల నిమిత్తం కువైట్‌లో ఉంటున్న వధువు సోదరి సుజాత రూ.70 వేలను తన పేరిట ఉన్న జన్‌ధన్‌ ఖాతాలో నాలుగు రోజుల క్రితం జమ చేసింది. ఆ ఖాతాకు సంబంధించిన ఏటీఎం కార్డు తండ్రి వెంకటేశ్వరరావు వద్దే ఉండటంతో సొమ్ము తీసుకునేందుకు ఏటీఎం సెంటర్లకు వెళ్లాడు. ఆ ఖాతా నుంచి సొమ్ము రావడం లేదు.బ్యాంక్‌కు వెళ్లి ఇదేమని అడిగితే.. జన్‌ధన్‌ ఖాతా కావడంతో స్తంభింప చేశామని, సుజాత స్వయంగా వస్తే తప్ప ఈ ఖాతాకు సంబంధించిన లావాదేవీలను పునరుద్ధరించలేమని మేనేజర్‌ చెప్పారు. కుమార్తె సుజాత కువైట్‌ నుంచి ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. పెళ్లి ఖర్చులకు అవసరమైన సొమ్మును ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుందామంటే ఇచ్చే పరిస్థితి లేదు. తన కుమార్తె వివాహం ఎలా చేయాలో అర్థం కావడం లేదని వెంకటేశ్వరరావు ఆందోళన చెందుతుంటే.. తమ డబ్బు తాము తీసుకోవడానికి ఈ నిబంధనలేమిటని వధువు శ్రీలక్ష్మి వాపోతోంది.
 
మరిన్ని వార్తలు