15 లక్షల మిషన్లు కావాలి!

4 Dec, 2016 03:00 IST|Sakshi
15 లక్షల మిషన్లు కావాలి!
  •  స్వైపింగ్ యంత్రాలకు భారీగా డిమాండ్
  •  అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు
  •  ఈసీఐఎల్‌తో సంప్రదింపులు
  •  ఏ జిల్లాలో ఎన్ని అవసరం?
  •  ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశం
  •  సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా స్వైపింగ్ మిషన్లను (పాయింట్ ఆఫ్ సేల్) అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మిషన్లను తయారు చేసే ఈసీఐఎల్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతోంది. లక్షలాది మిషన్లు అవసరమవటంతో.. భారీ ఎత్తున తయారీకి, సరఫరాకు ఉన్న మార్గాలపై చర్చలు జరుపుతోంది. రాష్ట్రంలోని బ్యాంకుల్లో ఈ మిషన్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుండటంతో స్వైపింగ్ మిషన్ల డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుతం బడా మాల్స్, సూపర్ మార్కెట్లకు పరిమితమైన స్వైపింగ్ మిషన్లను కూరగాయలమ్మే చిన్న రైతుల వరకు కూడా తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ప్రస్తుతం ఎన్ని స్వైపింగ్ మిషన్లున్నాయి.. ఎన్ని అవసరమున్నాయన్న ప్రణాళికను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
     
     రాష్ట్రంలో దాదాపు పది లక్షల నుంచి 15 లక్షలకు పైగా మిషన్ల అవసరం ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఆ మేరకు మిషన్ల లభ్యత.. సర్దుబాటుపై దృష్టి సారించింది. అయితే ఇప్పటికిప్పుడు అన్ని మిషన్లు సమకూర్చలేమని బ్యాంకర్లు, అధికారులు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని మాల్స్, సూపర్ మార్కెట్లలో అవసరానికి మించి స్వైపింగ్ యంత్రాలున్నాయి. ఎక్కువ మిషన్లున్న షాపులు, మాల్స్‌ను గుర్తించి.. అవసరానికి మించి ఉన్న మిషన్లను ఇతరులకు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర స్థారుు బ్యాంకర్లకు సూచించింది.
     
     నెట్ లేదా సిమ్ తప్పనిసరి
     ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఫోన్ లేదా మొబైల్ డేటా సిమ్‌కార్డుతోనే ఈ యంత్రాలు పనిచేస్తాయి. మిషన్లో తమ ఖాతా నంబరుతో పాటు ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిగేలా సాఫ్ట్‌వేర్ ఉంటుంది. దీంతో వ్యాపారులు అన్ని రకాల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో లావాదేవీలు నిర్వహించే వీలుంటుంది. కార్డును స్వైప్ చేసి తమకు రావాల్సిన డబ్బును అందులో ఎంట్రీ చేస్తే.. అంత డబ్బు కార్డుదారుల నుంచి వ్యాపారి కరెంట్ ఖాతాలో జమవుతుంది. కార్డులతో జరిగే ఈ లావాదేవీలపై బ్యాంకులు ఒక శాతం నుంచి 1.6 శాతం చార్జీలు వసూలు చేస్తున్నాయి. డేటా, నెట్ చార్జీలను వ్యాపారులే భరించాల్సి ఉంటుంది.

    మిషన్లు ఎవరిస్తారు?
    దాదాపు అన్ని జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు.. కరెంటు అకౌంట్ ఖాతాలున్న వారికి స్వైపింగ్ మిషన్లను సరఫరా చేస్తున్నాయి. ఈ మిషన్లు మార్కెట్లో కనీసం రూ.1,700 నుంచి రూ.5 వేల ధరలో అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులు వీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నాయి. ఇన్‌స్టలేషన్ చార్జీలు, మెయింటెనెన్స్ పేరిట కొన్ని బ్యాంకులు నెలకు రూ.200 నుంచి రూ.400 ఖాతాదారుల వద్ద వసూలు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు