అమరావతిలో భక్తుల సందడి

17 Aug, 2016 21:05 IST|Sakshi
అమరావతిలో భక్తుల సందడి
పుష్కర స్నానం చేసిన స్పీకర్‌ కోడెల
ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ మంత్రి 
 
సాక్షి, అమరావతి : అమరావతిలో పుష్కరాల ఆరో రోజైన బుధవారం ఉదయం ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. నదిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు అమరేశ్వరుని ఆలయంలో స్వామి దర్శనానికి రావడంతో క్యూలైన్‌లన్నీ కిక్కిరిశాయి. వీఐపీ ఘాట్‌ ఉన్నప్పటికీ దానికంటే అనుకూలంగా ఉండటంతో స్థానిక ధ్యానబుద్ధ ఘాట్‌లో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పుష్కర స్నానం చేసి పూజలు నిర్వహించారు. ఘాట్‌ ప్రాంగణం ఎదురుగా ఉన్న నమూనా దేవాలయాల వద్దకు వెళ్లి భక్తులు పూజలు చేస్తుండటంతో ఆ ప్రాంగణం సందడిగా కనిపిస్తోంది. 125 అడుగులతో నిర్మించిన బుద్ధుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యువత సెల్ఫీలు, చిన్నారులు ఆటలాడుకొంటూ సరదాగా గడుపుతున్నారు. సాయంత్రం తీరంలో ఆహ్లాదకర వాతావరణం భక్తులను కట్టిపడేస్తోంది. రాత్రివేళల్లో ఆ ప్రాంతం కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. నమూనా ఆలయాల పక్కనే చేస్తున్న చండీయాగానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై పూజలు చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అమరావతిలో పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. సత్యసాయి సేవా ట్రస్టు వారు ఏర్పాటుచేసిన ఉచిత భోజనశాలలో భోజనం చేశారు. ఎండ వేడి బుధవారం కూడా కొనసాగడంతో చిన్నారులు, వద్ధులు ఇబ్బందులు పడ్డారు. 
 
సేవలో తరిస్తూ...
ఫుష్కర స్నానాల కోసం వచ్చే వేలాది మంది భక్తులకు సేవలందిస్తూ స్వచ్ఛంద సంస్థలు మానవత్వాన్ని చాటుకుంటున్నాయి. ఘాట్లను శుభ్రంగా ఉంచడం, వృద్ధులను వీల్‌చైర్‌లో తీసుకురావడం, ఘాట్‌లో తాగి పడేసిన ఖాళీ వాటర్‌ ప్యాకెట్లను ఎప్పటికప్పుడు తొలగించడం చేస్తున్నారు. ఘాట్‌లలో స్నానాలు చేస్తున్న వృద్ధులకు ఆసరాగా ఉంటున్నారు. రోడ్డు వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు కూడా తమ దాతృత్వం చాటుకుంటున్నారు. ఉచిత అన్న ప్రసాదాన్ని భక్తులకు అప్యాయంగా అందజేస్తున్నారు. అమరావతిలో రామ భక్త సేవా సమితి వారు ఉచిత అల్పాహారం అందిస్తున్నారు.
 
మరిన్ని వార్తలు