నెలరోజులుగా ‘బడి’మూత! | Sakshi
Sakshi News home page

నెలరోజులుగా ‘బడి’మూత!

Published Wed, Aug 17 2016 9:06 PM

పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్న పాఠశాల - Sakshi

  • ప్రసూతి సెలవుపై ఉపాధ్యాయురాలు
  • సీఆర్‌పీ సైతం నిర్లక్ష్యంగా విధులు
  • ‘ప్రైవేటు’ బాటన విద్యార్థులు
  • పట్టించుకోని అధికారులు
  • గంగాపూర్‌లో పాఠశాల దుస్థితి
  • ములుగు: ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు ప్రసూతి సెలవుపై వెళ్లడం.. ఆ ఉపాధ్యాయురాలు స్థానంలో మరో ఉపాధ్యాయుణ్ని నియమించక పోవడంతో బడి నెల రోజులుగా మూతపడింది. ఆ తరువాత మొక్కుబడిగా ఆ బాధ్యతలను క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌(సీఆర్‌పీ)కు అప్పగించారు. అతను సైతం పిల్లలు రావడం లేదంటూ బడికి వెళ్లడం మానేయడంతో ప్రస్తుతం పాఠశాల తెరుచుకోవడంలేదు.

    మర్కుక్‌ గ్రామపంచాయతీ గంగాపూర్‌లోని గ్రామ ఏకోపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలలో ఈ దుస్థితి నెలకొంది.   గ్రామంలో సుమారు 40 మంది వరకు విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ నలుగురు విద్యార్థులు, ఒకే ఉపాధ్యాయురాలితో ప్రభుత్వ పాఠశాల కొనసాగుతోంది. అయితే ఉపాధ్యాయురాలు గత మార్చిలో ప్రసూతి సెలవుపై వెళ్లారు.   ప్రత్యామ్నాయంగా మరో ఉపాధ్యాయుణ్ని నియమించక పోవడంతో పాఠశాల మూతపడింది.

    అధికారులు బడిని తెరిపించి సీఆర్‌పీచే కొనసాగించారు. జూన్‌ 6 నుంచి 14 వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్‌గౌడ్, సీఆర్‌పీ రమేశ్‌లు కలసి తల్లి, తండ్రులకు నచ్చచెప్పడంతో 22 మంది పిల్లలను తల్లితండ్రులు స్కూల్‌కు పంపించారు. ఆ తరువాత ఉపాధ్యాయుడు లేక సీఆర్‌పీతోనే పాఠశాల నెట్టుకు రావడంతో వారుసైతం పిల్లలను బడికి పంపకుండా ఆపేశారు. దీంతో సీఆర్‌పీ సైతం పాఠశాల వైపు రావడం మానేశారు. దీంతో నెల రోజులుగా తెరుచుకోవడం లేదు.

    బడి తెరిపించేందుకు చర్యలు చేపడతాం
    ఉపాధ్యాయురాలు ప్రసూతి సెలవుపై వెళ్లడంతో నాలుగు నెలలపాటు సీఆర్‌పీతో పాఠశాలను కొనసాగించాం. విద్యార్థులు పాఠశాలకు రావడం మానేయడంతో నెల రోజులుగా మూతపడింది. బడిబాట అనంతరం తల్లిదండ్రులు 22 మంది పిల్లలను పాఠశాలకు పంపించారు. తిరిగి మూడు నాలుగు రోజుల తర్వాత పిల్లలను మాన్పించారు. మరోసారి గ్రామ సభ నిర్వహించి తల్లితండ్రలకు నచ్చజెప్పి బడిని తెరిపించేలా కృషి చేస్తాం. - రామకృష్ణాగౌడ్, ములుగు మండల విద్యాధికారి

    నచ్చచెప్పితే ఒప్పుకున్నారు
    పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని గ్రామస్థులకు నచ్చజెప్పడంతో తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలకు పంపబోమని ఒప్పుకున్నారు. గ్రామానికి పాఠశాల బస్సులను రాకుండా  రెండు, మూడు రోజులు అడ్డుకున్నారు. 22 మంది పిల్లలను పాఠశాలలో కూడా చేర్పించారు. ఆతరువాత ఏమైందో తెలియదు ఒకే సారి బడికి పంపడం మానేశారు. - రమేశ్, సీఆర్‌పీ

    టీచర్లను నియమిస్తే పిల్లలను పంపుతాం
    గ్రామ పాఠశాలలో మా పిల్లలకు సదువు సెప్పేందుకు సరిపడా ఉపాధ్యాయులను నియమిస్తే  ప్రభుత్వ పాఠశాలకు పంపుతాం. ఒక్క టీచరు ఎంతమంది పిల్లలకు సదువు చెప్తారు. బడి మూతపడి గడ్డిమొలిసింది. మొన్న జెండా వందనానికి బడిలో జెండా ఎగురవేయకపోవడంతో మస్తు బాధ అన్పించింది. - సోనాబాయి, గ్రామస్థురాలు

    సరిపోను సార్లు ఉండాలి
    బడిలో మా పిల్లలు సదువుకునేందుకు సార్లు సరిపోను వుంటే మా ఊర్లె బడొద్దని మాకెందుకు వుంటది. ఒకప్పుడు ఇద్దరు, ముగ్గురు సార్లతో ఇరవై, ముపై మంది పిల్లలతో బడి సందడిగ కనిపించేది. రానరాను టీచర్లు తగ్గడంతో పిల్లలు తగ్గారు. మా వూరి బడికి సరిపోను టీచర్లనిస్తే మా పిల్లలను మేము ప్రైవేట్‌ బడులకు పంపనేపంపం. - రాంసింగ్, గ్రామస్తుడు

Advertisement

తప్పక చదవండి

Advertisement