‘లక్ష్మీ’కటాక్షమే!

5 Oct, 2016 17:49 IST|Sakshi
పాలు పితుకుతున్న మహిళ

పాలనురగలు.. సిరుల ముల్లెలు
పచ్చని లోగిళ్లు.. హరిత వనాలు
మొక్కలకు పుట్టిన రోజు పండుగలు
సాధికారత దిశగా లక్ష్మీనగర్‌ మహిళలు


పాపన్నపేట: ఆకాశంలో సగం.. అవనిపై సగం మాత్రమే కాదు కుటుంబ పోషణలో.. పర్యావరణ పరిరక్షణలో.. హరిత ఉద్యమంలో..
సామాజిక చైతన్యంలో.. ఆర్థిక ప్రగతిలో.. పొదుపు మంత్రంలో.. మేము సైతమంటూ సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు.. మెతుకు సీమకే ఆదర్శంగా నిలుస్తున్నారు లక్ష్మీనగర్‌ మహిళలు. పాలనురగలు ఆపల్లెకు సిరుల ముల్లెగా మారుతున్నాయి. వారి ఆర్థికాభివృద్ధికి మూలాలవుతున్నాయి.

పాపన్నపేట మండలంలో మెదక్‌-బొడ్మట్‌పల్లి రోడ్డుపై ఉంది లక్ష్మీనగర్‌ గ్రామం.1950లో ఆంధ్రా›పాంతం నుంచి వలస వచ్చిన జనాలు ఈ గ్రామానికి పురుడు పోశారు. మంజీర గలగలల ఒడ్డున.. ఫతేనహర్‌ కెనాల్‌ పక్కన వెలసిన ఈ ప్రాంతం పచ్చని పంటలకు నిలయం. మగవారంతా వ్యవసాయం చేస్తుంటే.. పాడి వ్యాపారంతో ఆర్థికాభివృద్ధికి తమ శ్రమను సోపానాలుగా మారుస్తున్నారు ఆ గ్రామ మహిళలు. కుటుంబ పోషణకు మేము సైతమంటు తమ చేయూతనిస్తున్నారు.

సుమారు 1200 జనాభా గల ఆ పల్లెలో సగంమందికి పైగా మహిళలే. మగవాళ్ళంతా పొలంపనులకు వెళ్తే మహిళలు పాడి పనులే లోకంగా బతుకుతుంటారు. ఈ పల్లెలో సుమారు 400కు పై గేదెలున్నాయి. కోడికూతతో నిద్ర లేచే మహిళలు మొదట అడుగులు వేసేది పశువుల పాక వైపే. పేడ తీయడం.. గడ్డివేయడం.. పాలు పితకడం..కేంద్రానికి తీసుకెళ్ళడం ప్రధాన దినచర్య. గ్రామంలో నెలకు సుమారు రూ.3 లక్షల ఆదాయం పాల వ్యాపారంపైనే వస్తుంది.

ప్రణాళికాబద్ధమైన అడుగులు
ప్రభుత్వ సహకారంతో మెరుగైన ప్రణాళికతో ప్రగతివైపు అడుగులు వేస్తున్నారు మహిళలు. గ్రామంలో 21 డ్వాక్రా గ్రూపులున్నాయి. పొడిచన్‌పల్లి యూకో బ్యాంకు ద్వారా ఒక్కో గ్రూపు రూ.5 లక్షల రూణాలను తీసుకొని ,గేదెలు కొనుగోలు చేశారు. అలాగే ఇటీవల నాబార్డ్‌ సహకారంతో 16 గ్రూపులకు చెందిన మహిళలొక్కక్కరు రూ.50 వేల చొప్పునపాపన్నపేట సహకార బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని ఒక్కో గేదెను కొనుక్కొచ్చారు.

దళారి వ్యవస్థకు స్వస్తి చెప్పి మహిళలంతా గ్రూపుగా ఏర్పడి జనవరి 2015లో పాల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని విజయ డెయిరీ వాళ్ళకు విక్రయిస్తూ గిట్టుబాటు ధర పొందుతున్నారు. చాలా మంది మహిళలు తమ సంపాదనతో పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్‌ లాంటి కోర్సులు చదివిస్తున్నారు.

పచ్చని లోగిళ్లు
లక్ష్మీనగరంలో చెట్టు లేని ఇళ్లు లేదంటే అతిశయోక్తి లేదు. పూరిళ్లు అయినా.. ఆర్సీసి మేడ అయినా పచ్చని చెట్లతోనే స్వాగతం పలుకుతాయి. ఇటీవల హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 4 వేల మొక్కలు నాటారు. వాటి పరిరక్షణ కోసం మహిళలతో కూడిన కమిటీలు ఏర్పాటు చేసుకొని, వాటి చుట్టూ కంచెలు నాటి, ఎండా కాలంలో నీళ్లు పోస్తు వాటికి జీవం పోశారు.

ప్రతి యేడు జూలై 10 రోజున వినూత్న రీతిలో మొక్కలకు పుట్టిన రోజు వేడుకలు జరుపుతుంటారు. అలాగే దేవస్థాన గోమాతకు శ్రీమంతం జరిపి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక్కడ మరుగుదొడ్డి లేని ఇళ్లు లేదు. బాలవికాస ఆధ్వర్యంలో మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

గ్రామ అభివృద్ధి కోసం విలేజి డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. ఇందులో మహిళల క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామానికి చెందిన కమ్మలపాటి సాంబశివరావు, పద్మ,  సాంబశివరావు, శారద అనే రెండు కుటుంబాలకు చెందిన నిరుపేద దంపతులు ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల్లో ఇడ్లీలు అమ్ముతున్నాను.

సాంస్కృతిక కార్యక్రమాలతో మానసికోల్లాసం
మహిళలు కేవలం కష్టపడి పనిచేయడమే గాకుండా సాంస్క ృతిక.. ఆద్యాత్మిక కార్యక్రమాల ద్వారా మానసికోల్లాసాన్ని పొందుతున్నారు. గ్రామంలోని సుమారు 50 మంది మహిళలు కోలాటాన్ని నేర్చుకొని తిరుపతి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, భిక్కనూర్, ఏడుపాయల ఆలయాల్లో ఉత్సవాల సమయాన ప్రదర్శన లిచ్చి అందరి మన్ననలు పొందారు.

స్వాధ్యాయ కార్యక్రమం ద్వార ఆధ్యాత్మిక బోధనలతో పాటు శారీరక ఆరోగ్యాన్ని పొందడానికి మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష్మీనగర్‌ మహిళలు శ్రమైక జీవన సౌందర్యాన్ని అనుభవిస్తూ తోటి మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరిన్ని వార్తలు